పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/384

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాల్గవ ప్రకరణము.

371



నప్పుడు సభలో దండవిధాయకుఁడైన హామ్నెట్టు దొరగారిని కోరుకొనక యధ్యక్షత్వమునకు వేఱొకనిని కోరుకొనవలసినదని నేను చెప్పితినిగాని సభ్యు లుపకరగ్రాహిగారి యభీష్టమునకు వ్యతిరేకముగా నడచునంతటి ధైర్యశాలులు కానందున వారినే యధ్యక్షునిగాఁ గోరుకొనిరి. కరగ్రాహక కార్యములలోను దండనీతి ప్రయోగకార్యములలోను విశేషకాలము గడపవలసినందునను తఱుచుగా రాజకార్య విషయమున గ్రామాంతర సంచారము చేయవలసినందునను పుర పారిశుద్ధ్య విచారణ సంఘకార్యములలో తగినంత శ్రద్ధచేయుట కవకాశములేనివారయి హామ్నెట్టుదొరగారు పారిశుద్ధ్యసంఘ వ్యవహారములను చక్కఁబెట్టుటకయి తమ పక్షమున నొక్క ప్రతినిధి నేర్పఱుపఁగోరి సభ్యులలో నట్టిపనికెవ్వరు సమర్థులని మెట్కాపు దొరగారి నాలోచనయడిగిరి. వారు సుందరరావుగారిని పేర్కొనక నాపేరు చెప్పిరి. అందుమీఁద హామ్నెట్టు దొరగారు నన్నడుగఁగా నుద్యోగనియామకములు మొదలుగాఁగల సమస్తవిషయములలోను నాకు సర్వస్వాతంత్ర్యముల నిచ్చినఁగాని నేనాపని నంగీకరింపనంటిని. ఆయనయందున కొప్పుకొని సభ్యులయనుమతితో తమయధికారముల నన్నిటిని నాకు సంక్రమింపఁజేసెను. నేను యథాశక్తిని పనిచేసి ముఖ్యవిషయములలో నెల్లదొరగారితో నాలోచించి యాయన యంగీకారమును బడయుచు లంచములు మాన్పుటకును కార్యస్థాన వ్యవహారము లవిలంబముగాను యథాక్రమముగాను జరుపుటకును పన్నులవిషయమున మార్పులుచేసి యాయమును వృద్ధిపఱుచుటకును పాటుపడితిని. అంతకు పూర్వమిండ్ల పన్ను లెక్కువగానుండవలసినవారికి తక్కువగాను తక్కువగా నుండవలసిన వారి కెక్కువగాను కట్టఁబడి యుండెను. నేను ప్రతిగృహమును తిరిగిచూచి తక్కువ పన్నులున్న కొందఱు ధనికులయిండ్లకు హెచ్చుచేసి యెక్కువపన్ను లున్న కొందఱు బీదలయిండ్లకు తగ్గించి యంగడివీధినున్న కొట్లపైని న్యాయమైన పన్నులు విధించి మొత్తముమీఁద పారిశుద్ధ్య సంఘమునకుధనాగమ మెంతో హెచ్చునట్లు చేసితిని. సరిగా నెలకు పదేసిరూపాయలును అంతకంటె నెక్కువ