పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/378

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాల్గవ ప్రకరణము.

365



క్రొత్తగా కట్టుకొన్న యిల్లువిడిచి క్రొత్త స్థలమునకు పోవలెను. నేనాతని క్షమార్పణము నంగీకరించి యాతనిని రాజమహేంద్రవరములోనే యుంచవచ్చునని వ్రాసితినిగాని రాజధానీ వైద్యశాలాధికారి యతని నన్యస్థలమునకు పంపివేసెను.

ఒకదినమున నేను భోజనముచేసి పగలుపదిగంటలవేళ పాఠశాలకు పోవుచుండఁగా పట్నాల వీరేశలింగమను స్వర్ణకారుఁడొకఁడు నాలుగయిదడుగులు రాజవీధిలోని స్థలమాక్రమించుకొని పునాదులు (అస్థిభారము) ముందుకు జరపి గోడ లేవఁదీయుచుండెను. ప్రాతగోడయానవాళ్లింకను స్పష్టముగా కనఁబడు చుండెను. నేనదిచూచి యక్కడనిలిచి లోపలనున్న గృహపతిని పిలిపించి యిట్లక్రమముగా స్థలము నాక్రమింపఁగూడదనియు, పని, నిప్పుడు నిలుపుచేసి స్థలము నిమిత్తము పారిశుద్ధ్య విచారణ సంఘమువారికి విజ్ఞాపనపత్రిక పంపుకొని వారిచ్చినపక్షమున నిప్పుడు కట్టుచున్న రీతిగాను ఇయ్యని పక్షమున మునుపున్న రీతిగాను కట్టుకొనవలసినదనియు, చెప్పితిని. అతఁడు నామాట కొప్పుకొని పనిమానిపి పనివాండ్రనింటికి పంపివేసెను. నేను పాఠశాలలో పనిచేసి సాయంకాల మయిదుగంటలకు మరల నాదారినే యింటికి పోవుచుండు నప్పటి కాయింటిపని మరల నారంభింపఁబడినది. ఇది యేమనియడుగఁ గా నతఁడు తానుపోయి యావిభాగపారిశుద్ధ్యసంఘసభ్యుల నడుగఁగా నిది మీవిభాగములోనిదికానందున దీని నాపుటకు మీకధికారము లేదనియు తమ విభాగములోని దగుటచేత మనసువచ్చినట్టు చేయుటకు తమకే స్వాతంత్ర్యమున్నందున పెట్టుకోవచ్చునని సెలవిచ్చిరనియు చెప్పెను. నేనీవిషయమయి మఱునాఁడు సభవారికి జ్ఞాపిక పంపితిని. ఈజ్ఞాపిక సభలో విచారణకువచ్చుటకు లోపలనే యిల్లు కట్టించి పూర్వపుగుఱుతు లేవియు లేకుండఁజేసిరి. ప్రధానరథ్యలోనే యీవిధముగా నాక్రమణము జరగుటనుగూర్చి నేను సభలో మాటాడునప్పు డాస్వర్ణకారుని కాలోచనచెప్పిన యా విభాగసభ్యులు మాటాడక మౌనముధరించి తామేమియు నెఱుఁగనట్టూరకుండిరి. ఆసభ్యులిరు