పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/375

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

362

స్వీయ చరిత్రము.



దీపస్తంభముల నుపయుక్తస్థలములయందుఁ గాక తమ యిండ్లముందఱనే వేయించుకొనుచుండిరి; దీపముల గుత్తదారుఁడు వీధులలోని దీపములలోనుండి తగ్గించి చమురును సభ్యుల కొందఱి యిండ్లలోని దీపములకు పోయవలసి వచ్చుచుండెను. బాటలు బాగుచేయుటకయి యేటేట నియ్యఁబడు ప్రజల సొమ్ములో విశేషభాగ మీదుష్టుల సంచులలోనికే పోవుచుండెను. ప్రబలులైన ప్రజలు నిర్భయముగా తమ వీధియరుగులను పెంచియు, ఇండ్లను ముందుకు జరపికట్టియు, స్థలము నాక్రమించుకొని వీధు లంతకంతకు సన్న మగునట్లు చేయుచుండిరి. పారిశుధ్యశాసనవిధు లొక్క బీదలను మాత్రమే బాధించు చుండెనుగాని ధనికులు శాసన విధులనే బాధించుచుండిరి. పారిశుద్ధ్య విచారణ సంఘమువారి యధికారములోనున్న ధర్మ వైద్యశాలలో ధనము కావలసినంత వ్యయపడుచుండినను రోగులకు పథ్యపానములు తిన్నగా జరగక యాధనములో సగపాలు వైద్యశాలా సహాయులనఁబడెడి యల్పోద్యోగీయుల పాలగుచుండెను. ఈయక్రమములన్నిటిని సాధ్యమైనంతవఱకు మాన్పుటకయి పాటుపడఁ జొచ్చితిని. ఈవిషయములలో జరగిన రెండుమూఁడు కార్యములను మాత్ర మిందుదాహరించెదను.

రోగుల కెట్లు పథ్యపానములు పెట్టుచుండిరో పరీక్షించుటకయి యాసమయమునందు నేనొకదినమున ధర్మవైద్యశాలకుపోయితిని. అప్పుడు రోగులకు లెక్కలలో చూపఁబడినట్లు పాలును రొట్టెయుఁగాక గంజియు మెతుకులును పెట్టఁబడుచుండెను. నేను పరీక్షించి రోగులను ప్రశ్నించుచుండుటచూచి యొక సేవకుఁడు పరుగెత్తుకొనిపోయి వైద్యశాలా ప్రథానసహాయుఁడైన రంగయ్యనాయనిని దీసికొనివచ్చెను. అతఁడువచ్చి తనగుట్టు బయలఁబడునని తలుపులులోపలవేయించి నన్ను, లోపలకురాక వెలుపలనుండ వలసినదని నిషేధించెను. నేను వైద్యశాలను విడిచిపోయి యాతని చర్యను పురపారి శుద్ధ్యసంఘమువారికి తెలియఁ బఱచితిని. అందుచేత నతఁడు నాపైని ద్వేషముపూని యొక నాటిరాత్రి యొక పెద్దమనుష్యునియింట జరగిన సభలో