పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/374

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాల్గవ ప్రకరణము.

361

ప్రయాస దశయని చెప్పఁబడిన 1881 కిని 1890 కిని నడుమనుండిన యీ పది సంవత్సరములలోను నేనితర విషయములందును చుఱుకుగా పని చేయుచునే యుండెడివాఁడను. ప్రతిదినమును పగలు పదిగంటలకు పాఠశాలకుఁ బోయి సాయంకాల మైదుగంటలవఱకును పనిచేసి వచ్చు చుండెడి వాఁడను. నేను తీవ్రమైన యుబ్బసపు దగ్గుచేత బాధపడుచుండినను పాఠశాలకుపోయి బాలురకు బోధింపని దినము లత్యల్పముగానుండెను. విద్యార్థుల సంఘములకుఁబోయి యుపన్యాసములిచ్చి వారిని సత్కార్యములకు పురికొల్పుచుండెడివాఁడను. ఇన్నీసుపేట పాఠశాలయొక్కయు పట్టణ పాఠశాలయొక్కయు కార్యనిర్వాహక సంఘములలో నొక్కఁడనుగానుండి పనిచేయుచుండెడివాఁడను. మహమ్మదీయ విద్యాసంఘమునకు సహితము మహమ్మదీయుల ప్రార్థనమీఁద నేనేకార్యదర్శిగానుండి వారి విద్యార్థుల భోజనగృహమును నడపుచుండెడివాఁడను. పురపారిశుద్ధ్య విచారణ సంఘములోను (Municipal Council), తాలూకా స్థలనిధి సంఘము (Taluq Board)లోను, మండల స్థలనిధి సంఘము (District Local Fund Board)లోను, సభ్యుఁడనుగా నుండి పనిచేయుచుండెడివాఁడను. పురపారిశుద్ధ్యసంఘ సభ్యుఁడనుగానుండి యాకాలమునందా సంఘములోనుండిన యుత్కోచ గ్రహణాదిదౌష్ట్యముల నడఁచివేయుటకయి సర్వవిధముల ప్రయత్నముచేసితిని. సభ్యులలో లంచములు పుచ్చుకొనువారి నామముల పుటాక్షరములనే పాత్రముల పేరుల మొదట పెట్టి పారిశుద్ధ్య సంఘప్రహసనమును వ్రాసి వివేకవర్ధనిలో బహు పత్రికల యందు ప్రకటించితిని. అప్పటి పారిశుద్ధ్యసంఘ సభ్యులలో కొందఱు వేఱు జీవనాధారము లేనివారయి లంచములవలననే సుఖజీవము చేయుచుండిరి. ఆకాలములో పౌరులయొక్క ప్రతి విజ్ఞాపన పత్రమునకును సభ్యున కియ్యవలసినది యింత, కార్యస్థాన కార్యనిర్వాహకున కియ్యవలసినది యింత, ఆరోగ్య పరీక్షకున కియ్యవలసినదియింత, తుదకుత్తరువును దెచ్చెడి భటున కియ్యవలసినది యింత, అని మూల్యప్రమాణములే యేర్పడియుండెను. సభ్యులు