పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/372

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాల్గవ ప్రకరణము.

359



లలో సామాజికులుగా నుండినవారిలో 27 గురు పట్టపరీక్ష (బీ. యే) యందు కృతార్థులయిన వారుండిరి; ఇరువురు శాస్త్రోపాధ్యాయ (యమ్. ఏ) పట్టమునొందినవారు. సామాజికులలో న్యాయవాదులు, రాజకీయోద్యోగులు, వర్తకులు మొదలయినవారుండిరి. ఇంతమంది ఘనులుండినను పూర్వోక్తము లైన రెండునుగాక యైదుసంవత్సరములకాలములో క్రొత్త వివాహమొక్కటియే జరగినది. వెనుకటివానికి వలెనే దీనికిని రామకృష్ణయ్య గారిచ్చిన యిల్లే శరణమయినది. 1889 వ సంవత్సరము మార్చి నెల 29 వ తేదిని జరగిన యీ కోమటివివాహదంపతులకు కాకినాడలోని (తాడూరి రామారావుగారి యింటితోఁజేరిన) రామకృష్ణయ్యగారిచ్చిన యిల్లియ్య నిశ్చయింపఁగా బ్రాహ్మణులున్న యింటిలో కోమటులుండుట యననుకూలమని తాడూరి రామారావు పంతులుగారు మొఱ్ఱపెట్టి సమాజమువారి యనుమతితో నూతనదంపతుల కాపురమునకయి యిల్లు కట్టించుకొనుటకు మున్నూఱు రూపాయలిచ్చి యా యింటి భాగమును తాను స్వాధీనము చేసికొనెను. ఇఁకముందు నూతన దంపతుల కిచ్చుటకు సమాజమువారివద్ద నిండ్లు లేవు; ఇండ్లు కట్టించి యిచ్చుటకయి ధనములేదు. మాసమాసమునకు చందాలిచ్చి కూర్చినధనమును సేవకుల నెలజీతములకును వివాహము లాడినవారికిని నిచ్చు చుండుటవలనిఫల మతృప్తియు దూషణములును తప్ప వేఱులేదని కొందఱి మనస్సులకు తోఁచినందున వారు చందాలిచ్చుట మానుకొనిరి. అందుచేత సంవత్సరమున కాఱు రూపాయలిచ్చుట భారముగానుండునని సామాజికు లియ్యవలసిన చందాధన మాఱు రూపాయలనుండి మూఁడు రూపాయలకు తగ్గింపఁబడినది. ఆమూడురూపాయలిచ్చుట సహితము కష్టముగా కనఁబడినందున మూడొక్కటిగా చేయఁబడినది. ఆయొక్క రూపాయ సహిత మనేకులు క్రమముగా నియ్యకుండిరి. అందుచేత సేవకుల నెలజీతము లిచ్చుటయే సమాజమువారికి దుర్భరమయినందున, వారు పురోహితుని వంటబ్రాహ్మణుని తొలఁగించి వారిదారి వారిని చూచుకొండనిరి. దీనినిబట్టి సమాజమువారికి లెక్కలుంచవలసిన భారమును