పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/365

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

352

స్వీయ చరిత్రము.



ఱును అనుకూలముగా నున్నట్టు కనఁబడినపిమ్మట తిరిగి రాజమహేంద్రవరమునకువచ్చెను. ఆతనిభార్య యావత్సరాంతమున భర్తనువిడిచి, మరల రాజమహేంద్రవరమునకు వచ్చెను. నేనామెను కొంతకాలము నాయొద్ద నుంచుకొని బుద్ధులుచెప్పి యొప్పించి 1884 వ సంవత్సరము జనేవరి నెలలో మరల భర్తవద్దకు పంపితిని. ఇట్లెన్ని విధముల ప్రయత్నముచేసినను తుదకీదాంపత్యము పొసఁగుపాటునకు రాలేదు. భార్యాభర్తల కిరువురకును శీఘ్రకాలములోనే మరల స్థిరవియోగము తటస్థించెను. భార్య కడసారి పుట్టినింటికిఁబోయి మరల రాకున్న తరువాత నాతఁడు విశాఘపట్టణములో నొంటిగానుండి వంటచేసికొని భుజించుచు వేళకు కార్యస్థానమునకుఁబోయి పనిచేసి వచ్చుచుండెను. భార్య జీవించి యున్న వానికి మరల వివాహముచేయనని నాప్రతిజ్ఞయగుటచేత నే నాతనికి పునర్వివాహ ప్రయత్నము చేయలేదు. విశాఘపట్టణములో వితంతు వివాహము చేసికొన్నవాఁ డితఁడొక్కఁడేకాని సాయము చేయుటకు వేరు కుటుంబములేదు. ఈతఁడీ ప్రకారముగా బహు సంవత్సరములొంటిగా కష్టపడి కడపట 1888 వ సంవత్సరమునందు క్రైస్తవమత ప్రవిష్టుఁడయ్యెను.

1888 వ సంవత్సరము జూలయినెల 6 వ తేదిని కొమ్మరాజు గోపాలముగారి వివాహము జరగినది. ఈతనికియ్యఁబడిన వధువు వల్లూరి పున్నమ్మ. వివాహము నిమిత్తమయి రామకృష్ణయ్యగారే మున్నూరు రూపాయలు తమ మరణమునకు ముందిచ్చియుండిరి. ఆ మున్నూరు రూపాయలలో నిన్నూరు రూపాయలు వధువు నగలక్రిందను, నూరురూపాయలు వివాహవ్యయముల క్రిందను, కర్చు పెట్టఁబడినవి. రామకృష్ణయ్యగారి మరణశాసన ప్రకారమిల్లా వఱకే యుండినది. నెల కెనిమిదేసి రూపాయలచొప్పున సంవత్సరకాల మిచ్చుట తప్ప మఱేమియు నియ్య వాగ్దానము చేయలేదనియు తాను మఱేమియు నడుగఁగలవాఁడను కాననియు వరునిచేత వ్రాయించి పుచ్చుకొని