పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/341

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

328

స్వీయ చరిత్రము.



ఱును లక్ష్మీనరసింహముగారి కాలోచనచెప్పుట కిప్పడు మంత్రులయిరి. ఈ యభినవ మిత్రులు కొందఱు వివేకవర్ధనీ దహనవిషయమయి మొట్టమొదట నేమియు నెఱుఁగననిచెప్పి తరువాత నొప్పుకొని క్షమార్పణము వేఁడుకొనుట యవమానకరమని యాయనను పరిహాసముచేసి, పగతీర్చుకోవలెనని పురికొల్పఁ జొచ్చిరి. రామకృష్ణయ్యగారిచ్చిన పదివేల రూపాయలలో నేభాగమును వివాహములకుపయోగపడకుండఁ జేసినపక్షమున ముందు వితంతు వివాహములు జరగవనియు, అట్లు చేయుటయే పగతీర్చుకొని నన్ను సాధించుట యనియు, లక్ష్మీనరసింహ ప్రభృతు లావఱకే యాలోచించిరి! ఆహా ! ఇదియేమి యజ్ఞానము ! వివాహములు నిజముగానే జరగక పోయినయెడల నాకేమి యవమానము? పగతీర్చుకోఁ దలఁచినయెడల నాకపకారము చేయఁజూడవలెనుగాని నేను పూని పనిచేయుచున్నానన్న హేతువుచేత లోకోపకారకమయిన యనాధరక్షణ కార్యమునకు హాని కలుగఁజేయఁ జూచుట యేమి న్యాయము? ఇది యవివేక విలసనమయినను స్వప్రయోజన పరత్వముచేత వితంతు వివాహములు చేసికొన్న వారు కొందఱీ యనాలోచిత వ్యవహారమునకు సహాయులయిరి. కర్తవ్య నిశ్చయము వివేకవర్ధనీ దహనకాలమునకు ముందే చేయఁబడినను తదనంతర వ్యవహారభీతిచేత నింతకాలము కార్యారంభము విలంబము చేయఁబడెను. పదివేలరూపాయలవలన వడ్చెడివడ్డినంతను మీకే పంచిపెట్టుచుండెదనని యాశపెట్టి లక్ష్మీనరసింహముగారు రాజమహేంద్రవరములోనున్న వితంతు వివాహవరులను తనలోఁ జేర్చుకొని, వారిని గుమికూర్చి, రామకృష్ణయ్యగారు వ్రాసియిచ్చిన మరణశాసనములో "వివాహములు చేసికొన్న వితంతువులయొక్కయు వారి భర్తలయొక్కయు వారి బిడ్డలయొక్కయు పోషణము నిమిత్త" మన్న దాని కీవఱకు వివాహములుచేసికొన్నవారికి మాత్రమేయని యొక నూతనార్థము కల్పించి, ఆవఱకు వివాహములు చేసికొన్న వారిలోఁగూడ దూరమునం దుండుటచేత బళ్లారిలోనున్న వారి నిరువురను విడిచిపెట్టి, ఆవఱకు వివాహముకాని వారినికూడ నొకరినిం