పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/336

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాల్గవ ప్రకరణము.

323

జంబు - మీరు హానెస్టుమ్యానులుకాక లంచాలు పుచ్చుకుంటారా యేమిటి? కక్షిదార్లవద్దపశువులకు గడ్డీ కూరలూ పాలనిమిత్తంఆవులు వంటచెరకూధాన్యాలూ అపరదినుస్సులూ యీలాగంటివి తెప్పించుకోవడం లంచంకాదుగదా? రొఖ్ఖంగాపుచ్చుకోవడం లంచంగాని వాడుకనిమిత్తం రెండుమంచాలు పుచ్చుకున్నా పెట్టెలు పుచ్చుకున్న లంచంకాదు."

ఈప్రకారముగా మావ్యవహారమంతకంతకు ముదురచొచ్చినది. లక్ష్మీనరసింహముగారావఱకు బ్రహ్మసమాజసిద్ధాంతములయందు సంపూర్ణ విశ్వాసము కలదనిచెప్పుచు మాప్రార్థానాసమాజమునకప్పుడప్పుడు వచ్చు చుండెడివారు. శంకరాచార్యస్వాములవారిమీఁద తాముతెచ్చినయభియోగముకొట్టుపడిపోయిన తరువాత స్మార్తులుతమయింటికి కర్మలుచేయించుటకు రాకపోఁగా వైష్ణవులను చేరఁదీసి ప్రాయశ్చిత్తముచేయించుకొని తప్తముద్రాధారణమునొంది మధ్యవైష్ణవునకు నామములు మెండన్నట్లు ద్వాదశోర్ధ్వపుండ్రములను తులసిపూసల తావళములను గండభేరుండంచుబట్టలను ధరింపఁజొచ్చెను; ఈ నడుమనే జాతిభేదమువలని యనర్థములనుదెలుపుచు క్రైస్తవాచార్యప్రేరణమున నొక యుపన్యాసమిచ్చెను; స్మార్తులనుకూడఁగట్టుకొనివచ్చుటకయి యాకస్మికముగా వేదములయందపరిమిత విశ్వాసమునొంది వేదపాఠశాల పెట్టి వితంతువివాహప్రతిపక్షనాయకుల వేదపాఠశాలతో దానినిచేర్చిరి. వైదికముద్రాయంత్రమును వైదిక పుస్తకభాండాగారమును స్థాపించుటకయిచందాలు సమకూర్చినవిధమును వివరింపక నీతిపరులు మెచ్చఁదగినది కాదనిమాత్రమిచ్చట చెప్పుట చాలును. దంభాచార్యవిలసనములోనిందుఁబేర్కొనఁబడినదానిలో విశేషభాగము వాస్తవముగాజరిగినసంగతులే. ఉన్నమాటయన్న నులుకు వేసికొని వచ్చునన్న సామెతనందఱు నెఱుఁగుదురుగదా ? వివేకవర్థనీ దహన సంస్కార విషయమయి జరిగించినపనికభియోగము తెప్పించి తుదముట్టగ్రంథమునడుపుటకు నేను నిశ్చయించుకొని దానికిఁగావలసిన సాక్ష్యమునంతను సేకరించి సాధన సామగ్రితో సంసిద్ధుఁడనయియుంటిని. ఇంతలో మాయుభయుల మిత్రులును