పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/334

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాల్గవ ప్రకరణము.

321



యొక చిన్న వ్యాసమును, ప్రకటింపఁబడినవి. ఆవ్యాసములోని మొదటి భాగము నిందుఁ బొందుపఱచుచున్నాను. -

"మా డిస్ట్రిక్టు మునసపుగారి అద్భుత చర్య - రాజమహేంద్రవరపు డిస్ట్రిక్టు మునసపుగారైన మహారాజశ్రీ ఆత్మూరిలక్ష్మీనరసింహముగారు తమ యింట పనిచేయుచున్న గోలకొండ-అమ్మన యనెడు చాకలివానికి వెనుక తమ కోర్టులో బంట్రోతు పనియిచ్చినారు. వాఁడువారియింట పనిపాటలుచేయుచుండి, గతసంవత్సరముమార్చి నెలలో ఒకనాఁడు లక్ష్మీనరసింహముగారి పడకగదిలో మంచముమీఁదనున్న వెండిమట్టెలజతను ఎత్తుకొనిపోయినాఁడు. అందుమీఁద లక్ష్మీనరసింహముగారు తమబంట్రోతయిన బొలిసెట్టివెంకన్న చేత వానిమీఁద ఫిర్యాదుచేయింపఁగా ఏప్రిల్ నెలలో రాజమహేంద్రవరము రెండవక్లాసు మేజస్ట్రీటుగారువానికి నెలదినములు ఖయిదుశిక్షను విధించినారు. ఆ మఱునాఁడే మునసపుగారు వానినిపనినుండి తొలఁగించి బరతరపుచేసినారు. అటుతరువాతవాఁడు స్వగ్రామమయిన బందరుకువెళ్లి కొన్ని మాసములుండి మరలివచ్చి లక్ష్మీనరసింహముగారి ననుసరించుచు మరలవారియింట పనిపాటలుచేయు చుండెను. ఈప్రకారముండఁగా లక్ష్మీనరసింహముగారు వానికిపూర్వపునామధేయమునుతీసివేసి వీరన్న యనునూతననామకరణముచేసి, ఈక్రొత్తపేరుతో బరతరఫయిన అమ్మన్నకే యేప్రిల్ నెల మధ్యఆక్టింగుగా బంట్రోతుపనిని మరలనిచ్చినారు. అబదిలీపని యీమాసారంభముతోనయిపోయినందున వానికి మరలనొకబదిలీబంట్రోతుపనినిచ్చినారు. దొంగతనము చేసినందునకయి తానే శిక్షవేయించిపనితీసివేసి పయియధికారులకు తెలియఁజేయకుండ మరలపని నిచ్చుటయేకాక, ప్రజలకన్నులుగప్పుటకును పయియధికారులకు భ్రమింపఁ జేయుటకును మునుపున్న పేరునుగూడ వీరన్నయనిమార్చివేసినారు. గొప్ప పరీక్షలయందుఁ గృతార్థులయి దేశోపకారము నిమిత్తముపనిచేయుచున్నట్లందఱికిని తోచునట్లు ప్రవర్తించెడి యిటువంటివారే యిట్టియక్రమములు చేయుచుండఁగా తగినంతవిద్యలేక రాజకీయాధికారములను జేయువారెట్టియక్రమములకు లోఁబడరు?......................"