పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/331

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

318

స్వీయ చరిత్రము.



మిమ్ముద్దేశించియే వ్రాయఁబడినదనియు, చేతకానివారివలె మీరూరకుండుట పౌరుషము కాదనియు, ఆయనను పురికొల్పి ప్రోత్సాహపఱిచిరఁట! వారి మాటలపైని కోపావేశము గలవాఁడయి నెలపైనెనిమిది దినము లూరకున్న తరువాత నాకస్మికముగా దంభాచార్య విలసనమును కలిగియుండిన వివేకవర్ధనిని బుద్ధిమంతులందఱును చేరి యాలోచించిన యద్భుతవిధమున లక్ష్మీనరసింహముగారు దగ్ధముచేయించిరి. రెండవనాఁడు నేను మాపత్రిక ప్రకటన కర్తేచేత వ్రాయించిన లేఖనుబట్టి యాయద్భుతవిధము దీనిం జదువువారికి తేట పడవచ్చును -

"మహారాజశ్రీ ఆత్మూరి లక్ష్మీనరసింహం చెట్టియార్ గారికి. వివేకవర్ధని పత్రిక ప్రింటర్ అండు పబ్లిషరు కూరెళ్ల రామయ్య విన్నపములు.

యీనెల ది 9 తేదిని సాయంత్రము వివేకవర్ధని పత్రికను గడకుకట్టి దానికి పాతచెప్పున్ను చీపురున్ను కట్టి వివేకవర్ధనిలో ప్రచురంచేయించిన వాడినిన్ని చేసినవాడినిన్ని వివేకవర్థనినిన్ని బంగారయ్యమేడ అనే స్థలమందు తగులపెడుతామనిన్ని యిష్టం వున్న వారు వచ్చిచూడవలసినదనిన్నీ మీ కోటున్ ప్రెస్సాఫీసుల నవుకర్లు కొందరున్ను మీయిలాకా మనుష్యులున్నూ అనేలవిధములైన దూషణమాటలు వుపయోగిస్తూ పత్రికకున్ను పబ్లిషరుకున్ను పత్రికాధికారికిన్ని అవమానము (insult) పరువునష్టం (defame)న్ను, చేయడపు వుద్దేశ్యముతో యీబస్తీలో వీధులవెంట టముకు వేయిస్తూ ఆపనిమీవుత్తరువు ప్రకారము జరిగిస్తూవున్నట్టు ప్రచురంచేసినారు. యిందునుగురించి నేను న్యాయశాస్త్రప్రకారము చర్య జరగించతలచినాను గనుక యీవిషయములో మీకు యంతవరకు యిలాకావున్న దిన్ని (నాలుగు) 4 రోజులలోగా తెలియచేయగోరుతాను. చిత్తగించవలెను.

ది 11 మేయి 1886 సం.

రాజమంద్రి

కూరెళ్ల రామయ్య,

ప్రింటర్ అండు పబ్లిషరు."