పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/325

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

312

స్వీయ చరిత్రము.



గైకొనిపోయి యేమేమో ప్రయత్నములుచేసి మరల మాయూరికి రాకుండ తప్పించుకొనిపోయెను. ఇట్టి వివేకవర్ధని తొంటిలోకహితకార్యశూరత్వమును దౌష్ట్యనివారణదీక్షాపరత్వమును విడిచి శాంతమయి స్వపక్షరక్షణ పరాయణత్వమునకు మాత్రమే కడఁగుచున్నదని యిటీవల నపవాద మొకటి కొంచెము తలయెత్త నారంభించినది. వివేకవర్ధని స్వపక్షమువారి యక్రమములను వెల్లడింపక పక్షపాతము వహించుచున్నదని కొందఱు మిత్రులు నాతో నేయనిరి. మాపత్రిక స్వపక్షము వారన్న హేతువుచేత వారి దుష్కృత్యములను కప్పిపుచ్చుటకయి బుద్ధిపూర్వకముగా నేనెప్పుడును ప్రయత్నింపలేదుగాని బహు జనానర్థదాయకములుకాని యల్పదోషముల నుపేక్షించుచు వచ్చెను. ఒకానొకప్పుడు కొందఱియకార్యములను వెల్లడింపకపోవుట తటస్థించినను, ఆలోప మజ్ఞానముచేత నైనదేకాని మనఃపూర్వకమైనదికాదు. అల్ప దోషముల నుపేక్షించుచు వచ్చుటచేత నొకానొకరు నిర్భయులయి కొంతవఱకు యథేచ్ఛముగా సంచరించుచు వచ్చుటయుఁగలదు. అయినను భ్రమ ప్రమాదాదులు మనుష్య సామాన్యములగుటచేత మావివేకవర్ధని మాత్రము సర్వసామాన్యములైన మానుష దౌర్బల్యములు లేనిదనిచెప్ప నెవ్వరు సాహసింపఁగలరు? ఉండనిండు. దాని తాత్కాలిక విషమావస్థను దలఁచి యుదారచిత్తులగువారు తదపరాధములను క్షమింతురుగాక !

ఆత్మూరి లక్ష్మీనరసింహముగారు లంచములు పుచ్చుకొనువారు కాక పోయినను, తమన్యాయసభలో పనియున్న వారి యొద్దనుండి న్యాయమైన వెలలకంటె మిక్కిలి తక్కువవెలలకు ధాన్యము మొదలైన తమకుఁ గావలసిన పదార్థములను గైకొనుచుండిరి; తాము పూనినకార్యముల నిమిత్తమయి చందాలువేయించి కక్షిదారులవలన ధనస్వీకారముచేయుచుండిరి; తమయింట పనిచేయు సేవకులకు తమ కార్యస్థానములో పనులిచ్చి వారిన్యాయమయినపని నితరులచేత చేయించు చుండిరి; తాము బంధుమిత్రాదులను చూడ