పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/323

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

310

స్వీయ చరిత్రము.



కముగానుండెను. నేను చెన్నపురికి చందాలు పోగుచేయుటకై వెళ్లియుండినప్పుడు నామిత్రులైన బసవరాజు గవర్రాజుగారు నరసాపురమునుండి 1885 వ సంవత్సరము మెయి నెల 28 వ తేదిని వివేకవర్ధనినిగూర్చి నాకిట్లు వ్రాసిరి.

"I am doing my best for V. I am afraid we must employ a clerk to keep accounts & carry on correspondence. Without a clerk it is impossible for you or any body else to do this petty work. I think with a little system both the paper and the Press may be made to pay themselves at least. The paper is not very regular. But in course of time with another press it is quite possible to make the paper more regular." (వివేకవర్ధనినిగూర్చి నాచేతనైనంత చేయుచున్నాను. లెక్కలుంచుటకును ఉత్తర ప్రత్యుత్తరములను జరపుటకును మనమొక లేఖకుని పెట్టవలెనని నేను భయపడుచున్నాను. లేఖకుఁడు లేక యీచిన్న పనిని చేయుట మీకుఁగాని మఱియే యితరునికిఁగాని సాధ్యముకాదు. కొంచెము క్రమపద్ధతితో పత్రికయు ముద్రాయంత్రమునుకూడ అధమము తమంత పొట్టపోసి కొనునట్లు చేయవచ్చునని నేను తలఁచుచున్నాను. పత్రిక యంతక్రమముగాలేదు. కాని కొంతకాలములో నింకొక ముద్రాయంత్రముతో పత్రిక నిప్పటికంటె నెక్కువ క్రమముగా చేయుట మిక్కిలి సుసాధ్యమే."

ఇతర విషయములకయి ధనము కావలసి యుండుటచేత మితవ్యయము నపేక్షించి రాజమహేంద్రవరములో నున్నప్పుడు లెక్కల పనిని ఉత్తర ప్రత్యుత్తరముల పనినికూడ నేనే చేయుచుండెడివాఁడను. ఇంకొక ముద్రాయంత్రము కావలెనని యాయన వ్రాయఁగానే వెంటనే తగిన యేర్పాటుచేసి క్రొత్త ముద్రాయంత్రము నొకదానినికూడ నప్పుడే (1885 వ సం||) తెప్పించితిని. మా వివేకవర్ధని పేరు చెప్పిన లంచములు పుచ్చుకొనువారును, అక్రమములు చేయువారును, భయకంపితులగుచుండిరి. ఉన్నత న్యాయసభ వారొకసారి