పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/322

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాల్గవ ప్రకరణము.

309



డుండిన సదభిప్రాయము తేటపడుటకయి నేనుక్రొత్తగా నారంభించిన వివేకవర్ధనికి చందాను పంపుచు 1875 వ సంవత్సరము నవంబరు 14 వ తేదిని బరంపురమునుండి వ్రాసిన లేఖలోని మొదటి రెండు వాక్యముల నుదాహరించుచున్నాను.

" I am very glad that the sparcles of public spirit which were found in you when I was at Rajahmundry have now taken a flame. Every one that looks to public interest must assist you to the best of his ability in the successful carrying out of your laudable object,"

(నేను రాజమహేంద్రవరములో నుండినప్పుడు మీయందు కనఁబడిన జనహితబుద్ధిజ్వలనకణము లిప్పుడు జ్వాలగా నయినందుకు నేనెంతయు సంతసించుచున్నాను. ప్రజాక్షేమమును గోరెడు ప్రతిమానవుఁడును మీ శ్లాఘ్యమయిన యుద్దేశమును జయప్రదముగా కొనసాగించుటకు తన యావచ్ఛక్తిని మీకు తోడుపడవలయును.)

ఎప్పటివో చిన్నతనమునాటి కథల నటుండ నిచ్చినను, ఈయన నాయందు బాల్యమునందుండిన వాత్సల్యమునే కనఁబఱుచుచు మరల తాను రాజమహేంద్రవరము వచ్చినతరువాతకూడ నేను పూనిన స్త్రీ పునర్వివాహ దీక్షయందు నాకెన్ని విధములనో సాయపడుచుండెను. అయినను నాకు నెయ్యమునకంటె న్యాయము ప్రియతరమైనది. న్యాయమునకు గురువుతో గ్రుద్దులాడవలెనన్న న్యాయము ననుసరించి యిప్పుడాయనతో నేను ప్రతి ఘటింపవలసివచ్చినది. నేనాకాలములో వితంతు వివాహ విషయమున విశేషముగా పాటుపడుచుండినను, పురపారిశుద్ధ్య విచారణసంఘకార్యములలోను, పత్రికా నిర్వహణములోను, గ్రంథరచనలోను, దౌర్జన్య నివారణ ప్రయత్నములోను, ఉపన్యాసకరణములలోను, పూర్వగ్రంథ ప్రకటనములోను, కూడ సమానముగానే పాటుపడుచుండెడి వాఁడను. నేను ప్రకటించుచుండిన వివేకవర్ధని పత్రిక దుష్టవర్తనముగల వారికందఱికిని గర్భనిర్భేద