పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మొదటి ప్రకరణము.

19

పక్షమున, పాఠము నుపేక్షించుచున్నందునకు నన్నుఁ దిట్టి మాటలు పెట్టి నందునకు ముత్తవమీఁద కోపపడి, పోవుచుండును. ఆమె దాఁటిపోఁగానే మరల మేము మాలోకాభిరామాయణమును మొదలుపెట్టెడివారము. నే నింగ్లీషు నారంభించుటకు ముందే సంభవించిన యామె కైలాసప్రాప్తితో మా బాలవృద్ధకథా కాలక్షేపములు పరిసమాప్తి నొందినవి. బ్రాహ్మాణాచారాను సారముగా గర్భాష్టమునం దనఁగా నేడవయేటనే నాకుపనయనము జరగినది. నేను బ్రహ్మోపదేశమును బొందినది మొదలుకొని త్రికాలములయందును యుక్తసమయము నందు సంధ్యావందనము చేయుచు గాయత్రి నెంతో శ్రద్ధతో శతవారములు ప్రతిదినమును జపించుచుంటిని. సహస్రగాయత్రి చేసినదినములును గొన్ని కలవు. అప్పుడప్పుడు సాయంకాలముల గోదావరికిఁ బోయి యస్తమించుచున్న సమయములో సూర్యన కర్ఘ్యప్రదానము చేసి సంధ్యవార్చి ప్రదోషకాలమున మార్కండేయస్వామి యాలయమునకును వెనుక వేణుగోపాలస్వామి యాలయమునకును బోయి వచ్చు చుందును. త్రిరేఖలుదీర్చి దట్టముగా ముఖముమీఁదను ఱొమ్ముమీఁదను భుజములమీఁదను విభూతిపెండెకట్లు సవరించి, శుద్ధశ్రోత్రియునివలె బిళ్ళగోచి పెట్టి బట్ట గట్టుచుందును. ఒక్కప్రొద్దులును నుపవాసములును నుండలేకపోయినను, ఏకాదశినాఁటిరాత్రి ప్రొద్దుపోయినదాఁక మేలుకొనుటయేకాక యొక సంవత్సరము శివరాత్రినాఁడు జాగారముసహితము చేసితిని. ఏవానకాలపు చదువో యింట రఘువంశములో నైదుసర్గములు చదివియుండుటచేతను గూని సోమరాజుగారి బడిలో నాంధ్రనామసంగ్రహమును జదివి పురాణముల యర్థమును వినుచువచ్చుటచేతను గొంచె మర్థజ్ఞానము కలవాఁడనయి, మాయింట నున్న ప్రాఁతతాటాకుల పుస్తకములను దీసి చదువ నారంభించితిని. ఆకాలమునందు యుద్ధములను గూర్చియు తపస్సులను గూర్చియు చదువుట నాకెక్కువ యిష్టముగా నుండెను. ఋషులయొక్క మహిమలనుగూర్చి చదువునప్పుడు వారివలెఁ దపస్సు చేసి మహిమలు సంపాదింపవలెనని పలుమాఱు