పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/301

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

288

స్వీయ చరిత్రము.



నప్పుడు నెమ్మదితో వారిని సమాధానపఱుపఁజూడక పెద్దగొంతుకతో వారు దురాశాపరులనియు వారడిగినదియనుచితమైనదనియు నామనసులో నున్న దానిని మొగమోటలేక మొగముమీఁదనే స్పష్టముగా ననివేయుట. నేనీ ప్రకారము నిర్దాక్షిణ్యముతో పలుకువాఁడనైనను, ఎవ్వరికైనను నిజమైన కష్టము వచ్చినప్పుడు వారడుగకయే వారికి నాచేతనైనసాయమంతయుఁ జేసెడివాఁడను. కొన్ని మాసములైనతరువాత ఈగోపాలముగారిభార్యకే మసూరి (పోటకము) రోగమువచ్చెను. అప్పుడతనియసహాయస్థితిని కని పెట్టి వెంటనే యతని యింటికిపోయి, పథ్యపానములుచేసి పెట్టుటకు నాలుగు రూపాయలిచ్చి యొకబ్రాహ్మణస్త్రీని నియమించి, అయిదురూపాయలిచ్చి రాత్రిందివములు రోగియొద్ద కనిపెట్టుకొనియుండుటకయి యొకశూద్ర స్త్రీనిపెట్టి, కావలసిన పదార్థములు కొనియిచ్చి, ఆరోగ్యస్నానముచేయువఱకును నేను ప్రతిదినమును పోయి చూచుచుంటిని. గోపాలము వర్తించినవిధము కేవలమూఢత్వముచేతనే కలిగినదగుట చేత నాతనిదిక్షక్షమింపఁదగినదే. రాజమహేంద్రవరములో నున్న వారు నాకు తొందర కలుగఁజేయుచు వచ్చినట్లే కాకినాడలో నున్నవారు రామకృష్ణయ్యగారికి తొందర కలుగఁజేయుచువచ్చిరి. నామీఁద నేరములు చెప్పుటకయి యిచ్చటివారు రామకృష్ణయ్యగారి యొద్దకు వెళ్లునట్లే, రామకృష్ణయ్యగారిమీఁద నేరములు చెప్పుటకయి యచ్చటివారు నాయొద్దకు వచ్చుచుండిరి. నేను సొమ్మియ్యక వారిని తృప్తిపొందింపలేదు; ఆయన సొమ్మిచ్చియు వారిని తృప్తి పొందింపలేదు. ఏడవవితంతువివాహము చేసికొని కాకినాడలోనున్న బోడా శ్రీరాములు రామకృష్ణయ్యగారు తాను కోరిన విత్తమియ్యక పోవుటచేత భార్య నక్కడ విడిచి నాయొద్దకు పరుగెత్తుకొనివచ్చి రామకృష్ణయ్యగారి మీఁదనేమేమోచెప్పెను. నేనితని విషయమయి యాయనకువ్రాయగా 1885 వ సంవత్సరము జూలయి నెల 2 వ తేదిని వారు నాకిట్లు వ్రాసిరి.