పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/299

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

286

స్వీయ చరిత్రము.

విద్యలేని మూఢులు పలువురుచేరి చేయుదానికంటె విద్యాధికుఁ డొక్కఁడు చేయుహాని శతగుణము లధికముగానుండును. మనదేశములో యాచ్నావృత్తి హేయముగా నెంచఁబడకుండుటయు పాటుపడక కూరుచుండుట గొప్పయని తలఁపఁబడు చుండుటయు, చిరకాలాగతాచారము లగుటచేత కాయకష్టపడక నిరుద్యోగముగా కూరుచుండి స్వోదరపోషణార్థ మితరులను వేఁడి ధనార్జనముచేయుట లాఘవమని యెవ్వరును భావింపకున్నారు. అందుచేత నెల్లవారును ధనాకర్షణమునకు వెరవున్న పక్షమున నేయుపాయముచేతనైనను సాధ్యమైనంత డబ్బు లాగవలయుననియే యత్నించుచుందురు. వికాలాంగులుగాక యవయవపటుత్వముగల వారందఱును పాటుపడవలసిన వారే యనియు పాటుపడ నొల్లనివారికి ధనదానముచేసి సోమరితనమును ప్రోత్సాహపఱచుట పాపమనియు నామతము. నేను పాటుపడెడివాఁడను; ఇతరులు పాటుపడవలసినవారని తలఁచెడివాఁడను. కాయకష్టమువలనిగౌరవము నెఱుఁగని ముంజులూరి గోపాలము గారు (పంచమ వివాహవరుఁడు) జూని^నెల జీతము పుచ్చుకొన్నతరువాత తాను ముద్రాశాలలో పనిచేయననియు, (ద్వితీయ వివాహవరుఁడు) రామచంద్రరావునకునుఁ (చతుర్థవివాహవరుఁడు) శేషయ్యకును ఇచ్చు చున్నట్లే తనకును నెల కెనిమిదేసి రూపాయలచొప్పున నియ్యవలె ననియు నన్నడిగెను. వారి రువురును చదువుకొనుచున్నారు గనుక నిచ్చు చున్నాననియు, చదువులేక దృఢకాయుఁడవై యుండియు కష్టపడనొల్లని నీ కూరక యియ్యననియు నేను దృఢముగాఁ జెప్పితిని. ఎట్లియ్యరో చూతమని యతఁడును బండతనముచేసెను; దేవుఁడిచ్చిన యవయవముల నుపయోగింప నొల్లక యొడలు దాఁచుకొనఁదలఁచినవాఁడు తత్ఫలమనుభవింపవలసినవాఁడే యని నేనును సొమ్మియ్యకుంటిని. తాను పుచ్చు కొన్న జీతపుసొమ్మయిపోయిన తరువాత తిండికి లేక రామకృష్ణయ్యగారి యొద్దకు కాకినాడకు పోయి యతఁడు తన యవస్థను చెప్పుకొనెను. ఆయనయతనికి కొన్ని రూపాయలిచ్చి పంపివేసి, తరువాత నన్ను రాజమహేంద్రవరములో కలిసికొన్నప్పుడు మన