పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/288

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

274

స్వీయ చరిత్రము.



కార్యస్థానము (Stamp office) లో నొకవైష్ణవుఁ డుద్యోగములోనుండెను; ఆయనకు పురుషసంతానము లేక యొక్క తెయే కూఁతురుండెను; ఆయొక్క కూతురును పతివిహీనమయ్యెను. ఆతనియొద్ద నిరువది వేల రూపాయల సొత్తుండెను. చెంచలరావు పంతులవారి ప్రోత్సాహముచేత ఆవైష్ణవుఁడు బాలవితంతువైన తన కొమారితకు పునర్వివాహము చేయుట కంగీకరించెను. ఇఁక తగిన వరుఁడు కావలసియుండెను. నావద్దకు వచ్చు చుండెడు విద్యార్థులతో నే నీవిషయము ముచ్చటింపఁగా వారిద్దఱు వైష్ణవవిద్యార్థుల నన్నదమ్ములను నా యొద్దకుఁ గొనివచ్చిరి. వారిలో పెద్దవాఁడు పట్టపరీక్ష తరగతిలోను, రెండవవాఁడు ప్రథమశాస్త్రపరీక్ష తరగతిలోను, క్రైస్తవ కలాశాలలో చదువు చుండిరి. వారిలో పెద్దాతనికివివాహమయ్యెను గాని చిన్నతఁడు బ్రహ్మచారిగానే యుండెను. అతఁడన్న గారియనుమతిమీఁద నాబాలవితంతువును వివాహ మాడుట కంగీకరించెను. నేనాతనినిగొనిపోయి చెంచలరావు పంతులు గారికిచూపి వధువుతండ్రిని పిలిపించి యాతనికికూడ చూపినపిమ్మట నతఁడు తనకొమారిత నాచిన్న వానికిచ్చుట కొప్పుకొనెను. కొన్ని దినములలోనే ముహూర్త నిశ్చయము చేయఁబడినందున నాటిసాయంకాలము నేనును చెంచలరావుపంతులుగారును వధువుగృహమునకు పోయి, వివాహసన్నాహ మంతయు చేసి, మంత్రములు చెప్పుటకు యాజకుని నొప్పగించి, వరునావఱకే వారిగృహమునఁబెట్టి, వివాహమగునన్న నిశ్చయముతో మేమిరువురమును మా గృహములకుఁ బోయితిమి. నేను పరుండి నిద్రపోవుచుండఁగా రాత్రి పదిగంటలు దాటినతరువాత నొకమనుష్యుఁడు మాయింటికివచ్చి కేకలు వేసి నన్ను లేపి చెంచలరావు పంతులుగారు పంపిన్యుత్తరము నాచేతికిచ్చెను. ఈవివాహవార్తను దెలిసికొని ముందుగా నెవ్వరో కుంభకోణములో నున్న వరుని మేనమామలకు తంత్రీవార్త పంపిరనియు, వారాచిన్నవానిమీఁద నేదో యభియోగము తెచ్చి పోలీసువారిని వెంటఁగొనివచ్చి పెండ్లి పీటమీఁదఁ గూరుచుండియున్న వరుని బలవంతముగా నీడ్చుకొనిపోయిరనియు, తెల్లవాఱుజామున వారువెళ్లెడు పొగబండి