పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/276

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

262

స్వీయ చరిత్రము.



ఇవి రామకృష్ణయ్యగారి ధనముతో మాచే జరగింపఁబడిన పదునొకండవ పండ్రెండవ వితంతు వివాహములు.

ఇప్పుడు వివాహములుచేయుటకుమాత్రమే కాక ప్రతిమాసమును చేయ వలసినట్టి వ్యయములకు సహితము సొమ్ము కావలసియున్నది. న్యాపతి సుబ్బారావు పంతులుగారును, సీ. నాగోజీరావుగారును, ఆత్మూరి లక్ష్మీనరసింహముచెట్టిగారును, ఇతర సామాజికులును చందాలనొసఁగి సాయము చేయుచున్నను, మావ్యయములకు వారౌదార్యముతో నిచ్చెడు ధనము చాల కుండెను. అందుచేత చందాలు దయచేయుటకయి మహాజనుల వేఁడుట యావశ్యకమయి నందున, మాసమాజమువారు ధనసాహాయ్యార్థమైన తమ విజ్ఞాపన పత్రముతో నన్ను చెన్న పురి మొదలైన ప్రదేశములకుఁ బంప నిశ్చయించిరి. మాపాఠశాలకు వేసవికాలపు సెలవులియ్యఁబడిన పిమ్మట మాసమాజము వారిచే సమకూర్చఁబడిన యీక్రింది విజ్ఞాపన పత్రముతో చందాలు వేయించుటకయి నేను సకుటుంబముగా చెన్నపురికి ప్రయాణమయి పోయితిని. -

"స్త్రీ! పునర్వివాహము.

ఈక్రింద చేవ్రాలుచేసిన మేము రాజమహేంద్రవర వితంతు వివాహ సమాజపక్షమున మావేఁడికోలు వ్యర్థముకాదన్న సంపూర్ణ విశ్వాసముతో ధనసాహాయ్య నిమిత్తమైన యీప్రార్థనను హిందూదేశముయొక్క జ్ఞానసంపన్నులయిన మహాజనుల ముందుంచుట కనుజ్ఞ వేఁడుచున్నాము.

హిందువులలో నిర్బంధ వైధవ్యము వలనియనర్థములు చెన్న పురిరాజధానియందును హిందూదేశముయొక్క యితర ప్రదేశములయందును గూడ సర్వపక్షములను అత్యంతోత్సాహముతోను సమర్థతతోను ఈ నడుమనే విమర్శింపఁబడినందున వానినిక్కడ మరల ననువదించుట మా కనావశ్యకము. హిందూసుందరులయొక్క పునర్వివాహమును శాస్త్ర మంగీకరించుచున్నదని మహా