పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/275

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాల్గవ ప్రకరణము.

261



గుననియు, అందుచేత తమగుట్టు బైలఁబడకుండ వివాహములను స్థాలాంతరమునఁజేసి తమ్మవమానమునుండి కాపాడవలసినదనియు, ప్రయాణ వ్యయములను తాము వహించెదమనియు నన్ను బహువిధములఁబ్రార్థించిరి. నాకప్పటికి వారి కోరిక చెల్లించి వివాహపక్షము నపవాదమునుండి తప్పించుటయే యుచితమని తోఁచినది. ఈ యాలోచనలలో బహుదినములు గడచిపోయినవి. సెలవులంతముకావచ్చు చున్నందున నేను పోవలసిన దినములు సమీపించుచుండెను. వివాహము లొక్కస్థలములోనే జరపుచుండుటకంటె వేఱు వేఱు తావులలో జరపించుట యధిక లాభకరము గనుక మీస్థలములో జరపబూనుకొనెదరా యని మేము స్త్రీ పునర్వివాహ పక్షాభిమానుల కనేకులకు వ్రాసితిమి. వారిలో బళ్లారి నుండి రావుబహద్దరు సభాపతి ముదల్యారిగారు సమస్తవ్యయములను వహించి తమ పట్టణములో వివాహములను తాము చేయఁబూనుకొనెదమని వ్రాసిరి. నా సెలవులయి పోవచ్చినందున బళ్లారికివెళ్ళి వివాహములు చేయించి తిరిగి రాజమహేంద్రవరమువచ్చుట కవకాశముచాలక, వధూవరులు మొదలైనవారిని బళ్లారికిఁగొనిపోయివివాహములు జరపివచ్చుటకు నామిత్రులయిన మన్నవ బుచ్చయ్య పంతులుగారి కొప్పగించి, వేయిరూపాయలను బుచ్చయ్యపంతులుగారి చేతి కిచ్చునట్లు చెంచలరావు పంతులుగారితో మాటాడి యేర్పాటుచేసి, నేను మరలివచ్చితిని. ఈప్రయాణమువలన మా క్రొత్తసమాజమునకు ధనముకూర్చి చెన్న పట్టణమునుండి పట్టుకొనిపోవుటకు బదులుగా చెన్న పట్టణములో నున్న వేయి రూపాయలనుకూడ వ్యయముచేసి వట్టిచేతులతో మాయూరుచేరితిని. 1885 వ సంవత్సరము పిబ్రవరి నెల 6 వ తేదిని బుచ్చయ్యపంతులుగారు పెండ్లివారితో బళ్ళారికివెళ్ళినట్టు శ్రీ రఘుపతి వేంకటరత్నమునాయఁడుగారు నాకు తంతివర్తమానమును బంపిరి. [1] ఆనెల 12 వ తేదిని 15 ఏండ్లు ప్రాయము గల పెద్దవధువును చిత్తూరి సుబ్బారావుగారును, 12 ఏండ్లు ప్రాయముగల చిన్న వధువును జటప్రోలు రామారావుగారును బళ్ళారిలో వివాహమాడిరి.

  1. Marriage party Pantulu gone for celebration Bellary to day.