పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/273

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాల్గవ ప్రకరణము.

259



భావముతో "ఆయనమాటలకేమి లెండి?" అనిపలికి, నాతో నితరవిషయములను గూర్చి కొంతసేపు ముచ్చటించిరి. ఆయనవద్ద సెలవుగైకొని నేనింటికి వచ్చునప్పటికి కొందఱు విద్యార్థులు నన్ను చూడవచ్చి, మీరు పట్టణము వచ్చెదరని విని యొక వృద్ధ బ్రాహ్మణుఁడు నాలుగైదుదినములనుండి మీకొఱకు తిరుగుచున్నాఁడని చెప్పిరి. ఆయనను నావద్దకు తీసికొనిరండని నేను వారితోఁజెపితిని. మఱునాటియుదయమున వారావృద్ధుని నాయొద్దకుఁగొనివచ్చిరి. నానిమిత్తమయి విచారించుచున్న కార్యమేమని నేనాయన నడిగితిని. చిత్తూరు జిల్లాలో నొక గ్రామమున నిద్దఱు బాలవితంతువులుగలరనియు, వారికి వివాహముచేయుటకు తల్లి దండ్రులొప్పుకొని యున్నారనియు, ఆయన నాతో చెప్పెను. వారిని వివాహము చేసికొనుటకు వరులున్నా రాయని యడిగితిని. వరులును సంసిద్ధులయియే యున్నారని యతఁడు పలికెను. "అట్లయినచో నిఁక నాలస్య మెందుకు? చెంచలరావుగారివద్దకును రఘునాథరావుగారి యొద్దకునుపోయి వివాహము చేయింపరాదా?" అని నేనంటిని. "వారు మాటలవారేకాని కార్యములవారుకారు" అని యాయన నుడివెను. ఇందులో మీకింత శ్రద్ధయెందుకు? వితంతుకన్యలు మీకేమైన చుట్టములా ? అని మరల నడిగితిని. "వారిదుస్థ్సితి చూచి జాలినొంది మీరు చేయుచున్నది మంచికార్యమనియెంచి లోకోపకారముగా వాక్సహాయము చేయవచ్చితిని" అని యాయన పరోపకార చింతఁగల వానివలె పలికెను. "అట్లయినచో మీకు నావలన కావలసిన పనియేమున్నది?" అని నేనడుగఁగా, అయోమార్గవ్యయముల నిమిత్త మిరువదియైదు రూపాయలిచ్చిన పక్షమున తానుపోయి యిద్దఱు పెండ్లికూఁతులను వారి తల్లిదండ్రులను వరుల నిరువురను గొనివచ్చెదననియు తరువాత వారికి వివాహములు చేయవచ్చు ననియుఁజెప్పెను. ఆతనిమాటల ధోరణిని ముఖచిహ్నములును చూడఁగా నతఁడు మోసగాఁడు కానట్టు కనఁబడఁగా, మంచిది రమ్మని యాయనను నాబండిలో నెక్కించుకొని చెంచలరావు పంతులుగారియింటికి తీసికొనిపోయి జరగిన కథనుజెప్పి యిరువదియైదురూపాయలిమ్మని కోరితిని. ఇట్టివాండ్రు మోసము