పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/271

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాల్గవ ప్రకరణము.

257



కృష్ణయ్యగా రనుగ్రహించి పదివేల రూపాయలిచ్చిరి. ఆయిచ్చినప్పుడు మరల వివాహములగునన్న నమ్మక మాయనకు లేకపోవుటచేత రెండు సంవత్సరముల లోపల వివాహములు జరగనియెడల తమసొమ్ము తమకు మరల పంపివేయ వలసినదనియు, జరిగెడుపక్షమున వివాహ మొకటికి వేయేసి రూపాయలను మాసవ్యయములకు నెలకు డెబ్బదియైదేసి రూపాయలును నాకు పంపుచుండ వలసినదనియు, ఆయన యేర్పాటుచేసిరి. మితిపెట్టిన రెండు సంవత్సరములలోపలనే నేనిమిది వివాహములు చేయఁగలిగితిని. ఆయనయిచ్చిన యధికారప్రకారము నేను వ్యయముచేసి యుండినయెడల, జరిగిన యెనిమిది వివాహములకు నెనిమిదివేల రూపాయలును, 1882 వ సంవత్సరము ఏప్రిల్ నెల మొదలుకొని మాసమునకు డెబ్బదియైదేసి రూపాయల చొప్పున 27 మాసములకును రెండువేలపదునేను రూపాయలును, మొత్తము పదివేల పదునేను రూపాయలు కర్చుపెట్టి యీసమాజమువారికి నేను పదునేనురూపాయల ఋణము చూపియుందును. అట్లు చేయక నేను మితముగావాడి చెన్న పట్టణపు వివాహమున కొక్కదానికే 1671 రూపాయలు కర్చు పెట్టినను మొత్తముమీఁద నెనిమిదివివాహములకును 5668 రూపాయలు మాత్రమే వ్యయముచేసి మాసవ్యయములకు 1768 రూపాయలుమాత్రమే కర్చుపెట్టి, గృహములు కొనుటకయి వ్యయపఱిచిన 1166 రూపాయలును పాత్రసామానులు వైద్యపుకర్చులు మొదలైన వానిక్రిందనయిన 320 రూపాయలును కలుపుకొని యించుమించుగా 8921 రూపాయలు మాత్రమే కర్చు పెట్టి వేయి రూపాయలకంటె నెక్కువగా నిలువచూపితిని. సమాజము క్రొత్తదగుటను బట్టి చందాలు మొదలైనవి యేర్పడక పోవుటచేత కొన్ని మాసములవఱకు యథాపూర్వకముగా నేనే మాసవ్యయాదులు జరపుచుంటిని. నరసాపురమునుండి నేనువ్రాసిన యుత్తరమువలన రోషము వచ్చినవాఁడయి సంవత్సరమునర ప్రథమ శాస్త్రపరీక్ష తరగతిలో చదివిన తరువాత పాఠశాలకు పోవుట మానుకొని పులవర్తి శేషయ్యగారు మండల న్యాయసభలో లేఖకోద్యోగమునందు ప్రవేశించెను.