పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/269

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాల్గవ ప్రకరణము.

255

స్త్రీ పునర్వివాహ వ్యాపారముయొక్క భూతవర్తమానస్థితులను గూర్చి 1887 వ సంవత్సరము జనేవరు నెలలో సమాజముయొక్క సంవత్సర సభయందు నేను చదివినదానిలో "1884 వ సంవత్సరము మెయి నెలలో నేను నరసాపురము వెళ్లియుండినప్పుడు నేనెప్పుడు నెదురుచూడని తావునుండి నాకొకయుత్తరము వచ్చి నాకాశ్చర్యము పుట్టించినది. నేనీపనిమీఁద నరసాపురమునుండి బందరుపోయి తిరిగి రాఁగానే జూన్ నెలలో సభచేసి యిప్పుడున్న రీతి సమాజ మేర్పఱుచుటకుఁ బ్రయత్నించినాను. ఇప్పుడున్న రీతిగా మన యీసమాజ మప్పుడేర్పడినదే." అని చెప్పితిని. ఇందుఁ జెప్పఁబడిన యుత్తరము వ్రాసినతఁడు పులవర్తి శేషయ్యగారు. నాకాశ్చర్యము పుట్టించుటకు కారణము నేను నరసాపురమునకు బైలుదేఱు దినమువఱకును నా యెడల వినయభక్తులు కనఁబఱుచుచు నాకుపరమభృత్యుఁడుగానుండి యాదినమున సహితమువచ్చి పయినెల జీతమును పాఠశాల జీతమును పుచ్చుకొని నన్నూరికి సాగనంపినతఁడు నేను లేనిసమయములో నాకస్మికముగా మాఱి నేను మొదటపెక్కు సామాజికులతో నిండియుండిన వితంతువివాహ సమాజములో నాసామార్థ్యమువలన సామాజికులు లేకుండఁజేసితిననియు, నేనేదారిని బోవుచున్నానో యెవ్వరికిని దెలియకుండ పాటుపడుచుంటిననియు, మిధ్యా దోషా రోపణములుచేయుచు నుత్తరమువ్రాయుట. ఆయుత్తరములోని కడపటి ప్రార్థనము తమకు నిరంకుశప్రభుత్వముగాక ప్రతినిధిప్రభుత్వము కావలెననుట. అతఁడు బుద్ధిహీనుఁడయి దుష్టులప్రోత్సాహముచేత ననాలోచితముగా నిట్లు వ్రాసినందుకు చింతనొందుచున్నాననియు, నేనుజేసినపని యెల్లరకును తెల్లమే గాన నిఁకముందేర్పడు సమాజములోఁ జేరి మీరు నాకంటె నెక్కువ పనిచేయుచుండఁగా చూచి సంతోషించెదననియు, నేను రాజమహేంద్రవరమునకు తిరిగి రాఁగానే సమాజము నేర్పఱిచి వివాహవ్యవహారము వారి కొప్పగించెదననియు, బదులువ్రాసి బందరుకుపోతిని. బందరునుండి నేను మరలిరాఁగానే న్యాపతి సుబ్బారావుపంతులుగారు ఆత్మూరి లక్ష్మీనరసింహముగారు