పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/268

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

254

స్వీయ చరిత్రము.



చేయవలెనో, అటువంటి ప్రాథమికనిబంధనములనుగూర్చి శాస్త్రులవారును నేనును నేకాభిప్రాయూమునకు వచ్చినపిమ్మట మేము శాస్త్రచర్చ కుపక్రమించితిమి. కలియుగమునకు పరాశారస్మృతి యొక్కటియే పరమప్రమాణమయి నందున తద్విరుద్ధ స్మృతులన్నియు నప్రమాణములనియు, పరాశర సంహితలోని "నష్టేమృతే" యను శ్లోకముయొక్క యర్థనిర్ణయ మొక్కటియే ప్రథమకర్తవ్యమనియు, నేను చెప్పఁగా శాస్త్రులవారును నాతో నేకీభవించి ఆశ్లోకమునకర్థము చెప్ప నారంభించిరి. వారు చెప్పఁ బూనిన యర్థము ప్రథమమునఁ జేసికొన్న నియమములకు విరుద్ధమనియు, తన స్మృతిలో పరాశరుఁడు చెప్పిన నిర్వచన మీయర్థమును బాధించుననియు, నేను వారు చేసెడి యర్థములను పూర్వపక్షముచేయ నారంభించితిని. ఇట్లు పావు గంటసేపు శాస్త్రార్థవిచారము నడచినపిమ్మట శాస్త్రులవారు క్షణకాల మూరకుండి సభవారి వంకఁదిరిగి, "అయ్యా! వీరు తమ జీవితము నిందులో ధారపోసి యీవిషయమయి విశేషకృషి చేసినారు. నాకు కొంతకాలము గడువిచ్చినఁగాని వీరితో వాదము చేయఁజాలను," అని యూరకుండిరి. ఆకాలమునం దనేక పండితులతో ననేకస్థలములయం దీవిషయమయి నేను వాదములు చేసితినిగాని తాము యుక్తి చెప్పలేక పోయినప్పుడు తమయశక్తి నొప్పుకొని సత్యమునందాదరము చూపినవారని వీరి నొక్కరిని దక్క మఱియెవ్వరిని నేను చూడలేదు. సాధారణముగా పండితులు వాదములో తాము పరాజయమునొందినను తమయోటమి నొప్పుకొనక "శేషంకోపేన పూరయేత్" అను న్యాయము నవలంబించి క్రిందఁబడినను తామే గెలిచితిమని కేకలువేయుదురు. ఈశాస్త్రి గారి పేరిప్పుడే నాకు స్మరణకు రాలేదు. సూర్యనారాయణశాస్త్రిగారు కాఁబోలును ! ఈసభానంతరమున వేంకటాచలము పంతులుగారు తాంబూలాది సత్కారముచేసి నన్ను వీడుకొల్పిరి. అక్కడి ప్రముఖులవద్ద సెలవుగైకొని సకుటుంబముగా నేను రాజమహేంద్రవరమునకుఁ బోయితిని.