పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/267

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాల్గవ ప్రకరణము.

253

డిప్యూటీకలెక్టరుపని చేసి యుపకారవేతనమునొంది కర్మిష్ఠులయి యుండిన వడ్లమన్నాటి వేంకటాచలము పంతులుగా రాపట్టణములో వితంతు వివాహ ప్రతిపక్షులకు ప్రధాననాయకులు. వారు బృందావనపురములో మిక్కిలి పేరుపొంది యెల్లరచే గౌరవింపఁబడుచుండిన యొక గొప్ప పండితునిచేత నావితంతు వివాహవిషయక విజ్ఞాపనములమీఁద నొక ఖండన గ్రంథమును వ్రాయించిరి. ఆఖండనగ్రంథములోని యుక్తులకు ప్రతియుక్తులు చెప్పుటగాని, చూపిన ప్రమాణములను ఖండించుటగాని, చేసినసిద్ధాంతములను పూర్వపక్షముచేయుటగాని, సాథ్యముకాదని వారు నమ్మియుండిరి. నేను వేంకటాచలము పంతులుగారి దర్శనార్థమయి యొకనాటి ప్రాతఃకాలమున వారి యింటికి వెళ్ళినప్పుడు వారు లోపల జపము చేసికొనుచుండి నన్ను లోపలికి రప్పించుకొని తమ సరసను పీటమీఁద కూర్చుండఁబెట్టి నాతో చాలసేపు మాటాడిరి. ఆసంభాషణలో వారు శాస్త్రప్రమాణరహితములైన పొడిమాటలతో ప్రయోజనము లేదనియు, శాస్త్రప్రమాణ బద్ధులైన హిందువులకు శాస్త్రార్థ విచారమావశ్యకమనియు, ఆవిషయమయి యొక పండిత సభ జరగుట కర్తవ్య మనియు, సెలవిచ్చిరి. నేనును వారితో నేకీభవించి, పామరజన బహుళమైన సభలో శాస్త్ర చర్చచేయుట నిష్ప్రయోజనమనియు, పండితులును గుణగ్రహణ పారీణులైన పెద్దమనుష్యులును మాత్రము చేరిన చిన్న సభలో శాస్త్రవిషయక వాద ప్రతివాదములు జరపుటయే లాభకరమనియుఁ, జెప్పితిని. వా రందున కొప్పుకొని మఱునాటి మధ్యాహ్నమున తమ చావడిలోనే సభ జరపుట కేర్పఱిచి, ఉభయపక్షములలోను జేరిన పెద్ద మనుష్యులకుఁ గొందఱికిని విద్వాంసులకుఁ గొందఱికిని, ఆహ్వానములు పంపిరి. నేనును యుక్తసమయమునఁబోయి సభలోఁ గూరుచుంటిని ; నాగ్రంథముపై ఖండన గ్రంథముచేసిన శాస్త్రులవారు పండితపక్షమున తత్ప్రతినిధిగా నాతో వాదము చేయుటకయి నాయెదుటను గూరుచుండిరి. ధర్మార్థ విచారమునకు ప్రమాణగ్రంథములేవో, వాని గౌరవతారతమ్య మెట్టిదో, అర్థనిర్ణయమెట్లు