పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

14

మొదటి ప్రకరణము.

రేడ్వఁదొడఁగుట చూచి మొగము చిన్న చేసికొని వారితో నేనును నేడ్చితినే కాని వా రేల యేడ్చెదరో నే నేల యేడ్వవలయునో నే నప్పుడేమియు నెఱుఁగను. ఏడుపు చాలించినతరువాత నేల యేడ్చితి రని మావారి నడిగి వారిని మరల నేడిపించుటయేకాని వారివలన నాప్రశ్నమున కుత్తరమును గానక యీవలకు వచ్చి మావారేల యేడ్చెదరని యచ్చట నున్న వారి నడిగితిని. మీనాన్న గారు పోయినారని యొకరు చెప్పఁగా "ఎక్కడకుఁబోయినారు? మరల నెప్పుడువత్తురు?" అని నే నెఱుఁగనిప్రశ్నలు వేయఁ దొడఁగితిని. మాతండ్రిగారిని "నాన్న" యనియు, పెదతండ్రిగారిని "బాబాయి" యనియు పిలుచుట నాకు వాడుక. నాకు నాతండ్రిగారికంటె పెదతండ్రి గారివద్దనే చన వెక్కువ. అందుచేత నాకప్పుడు పితృవియోగ దుఃఖము మనసున నాటలేదు. నా పెదతండ్రిగారు న న్నె ప్పుడును క్రింద దింపక యెత్తుకొని తా నెక్కడకుఁ బోయినను వెంటఁ గొనిపోవుచు, అంగళ్ళవాడకుఁ గొనిపోయి నాకు చిఱుతిండి కొనిపెట్టుచుండెడివారు. ఆయన యొక్క దినము కంటఁ బడకపోయినపక్షమున నేను బెంగ పెట్టుకొని యాయననిమిత్త మేడ్చు చుండెడివాఁడను. మాతండ్రిగారి యుత్తరక్రియ లయినతరువాత మే మందఱమును కాకినాడ విడిచి వచ్చి రాజమహేంద్రవరము చేరితిమి.

ఆకాలమునందు గోదావరికాలువలు క్రొత్తగా త్రవ్వుచుండిరి. అప్పుడు కాలువలపనిపై నధికారము వహించియుండిన యొకదొరవద్ద నా పెదతండ్రి గారికి లేఖకోద్యోగము దొరకినది. ఆయన మొట్ట మొదట నొంటిగాఁ బోయి కొన్ని మాసము లున్న మీఁదట కుటుంబమును దనయొద్దకు రప్పించుకొనుట కయి మనుష్యులను బంపెను. మాతాతగారితల్లి నట్టింటఁ బడి కాలు విఱుఁగఁ గొట్టుకొన్నందున, ఆమెయుపచారార్థముగా కోడ లామెవద్ద నుండవలసిన దయ్యెను. అందుచేత మాతాతతల్లిని మాతండ్రితల్లిని గృహమున నట్టెయుంచి, మానిమిత్తము వచ్చిన మనుష్యులవెంట బైలుదేఱి యయిదేండ్లవాఁడ నయిన నేనును నాతల్లియు పెదతల్లియు నొకపల్లకిలోఁ గూరుచుండి పోవుచుంటిమి