పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/256

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

242

స్వీయ చరిత్రము.



వారు తాము తమబంధువుల యిండ్లసహితము భోజనములు చేయుచుండ లేదనియు భోజనములు చేసినంతమాత్రముచేత కలిగెడు ప్రయోజన మేదియు లేదనియు సెలవిచ్చి నాప్రార్థనను మన్నింపరైరి. దీనిని పత్రికలలోఁ బ్రకటింపవలసినదని యుత్సాహవంతులైన సంస్కారోత్సుక తరుణవయోవంతులు నన్ను బలవంతపెట్టిరిగాని వారికోరికకు నేనంగీకరింప లేదు. ఈ వివాహమునకు చెన్న పురిలోనైన రు 850 రూపాయలునుగాక వేయింటిలో మిగిలిన 150 ర్య్య్పాయలును రఘునాధరావుగారు నాకిచ్చిరి. ఈప్రకారముగా 1883 వ సంవత్సరము జూన్ నెల 8 వ తేది నారంభింపఁబడిన యీవివాహమహోత్సవము పండ్రెండవతేదితో సంతోషకరముగా సమాప్తమయినది. వివాహమునకు దయచేసిన రావుబహద్దరు ఆర్కాటు నారాయణస్వామి మొదల్యారిగారు బెంగుళూరుకు రావలసినదని నన్నాహ్వానము చేయఁగా నేనొక్కఁడను వెళ్లి దండులో నుపాధ్యాయులుగానున్న గోపాలస్వామయ్యగారింట దిగి దండులో నొకటియు పట్టణములోనొకటియు వితంతువివాహమునుగూర్చి రెండుపన్యాసములు చేసితిని. అప్పుడు బెంగుళూరిలో నుండిన యాఱువేల నియోగులందఱును నొకచోటఁగూడి నన్నుఁబిలుచుకొనిపోయి చందన తాంబూల పుష్ప మాలాదులతో నన్ను సత్కరించిరి. నేనక్కడ రెండుదినములుండి మిత్రులను వీడ్కొని మరల చెన్న పట్టణమునకువచ్చి మావారల నందఱిని వెంటఁబెట్టుకొని ధూమనౌక మీఁదపోయి స్వస్థానమును సురక్షితముగాఁ జేరితిని. ఈవఱకు జరగిన వివాహము లన్నిటిలో దీనికే యధిక వ్యయమయినది. చెన్న పట్టణములో వ్యయపడిన రు 850 లుగాక రాకపోకలకు ప్రయాణముక్రింద రు 331 లయినవి ; తరువాత పెండ్లికొమారితకు మాన్యము విడిపించియిచ్చుట కిన్నూఱు రూపాయలయినవి ; గుంటూరికావలనున్న వల్లూరునకు వెళ్లి యీసంబంధమును కుదిర్చిన యామెకు రు 40 లిచ్చితిమి ; పెండ్లికొమారితతల్లి రెండుసారులు వల్లూరు వెళ్లి వచ్చినందునకును పెండ్లికూతులను తెచ్చినందునకును రు 40 లయినవి ; పెండ్లి