పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/255

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాల్గవ ప్రకరణము.

241



బ్రకటింపఁబడినది. పట్టణములోని వృత్తాంతపత్రికలకును మిత్రులకును తగు మనుష్యులకును వారే యాహ్వానపత్రికలను బంపిరి. పందిళ్లు వేయించుట, కదళీ స్తంభములను తోరణములను కట్టించుట, పెండ్లికిఁ గావలసిన సమస్తసంభారములను సమకూర్చుట, మొదలైనవాని నన్నిటిని రఘునాథరావుగారే తమ మనుష్యులచేత చేయించిరి ; వంటకుఁ గావలసిన పాత్రసామగ్రిని భోజన పదార్థములను పుష్కలముగా సమకూర్పించిరి. చెన్న పురి చేరినతరువాత పెండ్లికూఁతుల తల్లి తన రెండవకొమారితను ప్రకాశరావుగారికిచ్చి పెండ్లిచేయుట కంగీకరింపనందున నొక్క వివాహము మాత్రమే చెన్న పట్టణములో జరగినది. వితంతువివాహము జరగుటకు చెన్న పట్టణములో నిదియే ప్రథమమగుటచేతను, ముందుగానే వార్తాపత్రికలలో నెల్లఁ బ్రకటింపఁబడి యుండుటచేతను, ఈవివాహమునకు జను లపరిమితముగా వేడుక చూడవచ్చిరి. పట్టణములోని పెద్ద మనుష్యులు సహిత మెవ్వరు నెదురుచూడనంత విశేషముగా దయచేసి, యమితోత్సాహమును గనఁబఱిచిరి ; అనేకులు వధూవరులకు కట్నములు చదివించిరి. లగ్న సమయమున కట్నములక్రిందవచ్చినవి పదునేడుబట్టలు. నాటిరాత్రి జయప్రదముగాను ప్రోత్సాహకరముగాను లగ్నము నడచినందుకు సంతోషించి రఘునాథరావుగారు వృద్ధు లయినను మరల యౌవనము పొడచూపిన వారివలె నపరిమితోత్సాహముతో సందడించుచు నాలుగుదినములును శుభకార్యము నత్యంత జయప్రదముగా జరపించిరి. మహా వైభవముతో దంపతుల నొక రాత్రి యూరేగించిరి ; ఒక దినము వధూవరులను కచ్ఛాలేశ్వరుని యాలయమునకుఁ గొనిపోయి వారిచేత నభిషేకము చేయించిరి. కావలసిన యేర్పాటులన్నియు దివ్యముగా చేయఁబడినందున కెల్ల వారును నానందభరితులైరి. భోజనములకు సహితము విద్యార్థులనేకులును సంస్కార పక్షావలంబులైన యితరులు కొందఱును వచ్చిరికాని రఘునాథరావుగారు మొదలైన ప్రముఖు లెవ్వరును రాలేదు. వంటచేయుటకయి మాధ్వదంపతులనే తీసికొనివచ్చితిని గాన భోజనమునకు రావచ్చునని రఘునాథరావుగారితో విన్న వించితినిగాని