పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/248

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

234

స్వీయ చరిత్రము.



సంసిద్ధురాలనయి యున్న దాననని యాచిన్నది నన్ను దీనముగావేఁడుకొనెను. మా ప్రాతపురోహితుఁడైన రామసోమయాజులు ప్రాయశ్చిత్తము చేయించుకొని పాఱిపోఁగా, విధురుఁడైన చెఱుకూరి నారాయణమూర్తియను నతని పురోహితునిగా నేర్పఱుచుకొంటిమి. అతఁడు తిన్న గా మంత్రములువచ్చినవాఁడు కాకపోయినను మేమతనితోడనే గడపుకొనుచుంటిమి. ఆదినమున 23 సంవత్సరముల ప్రాయముగల యాతనిమేనల్లుఁడొకఁడు అమలాపురము నుండి రాజమహేంద్రవరము మీఁదుగా కాకినాడకుపోవుచు మేనమామనుచూడఁబోయెను. మేనమామ మేనల్లుని వితంతువివాహము చేసికొమ్మని ప్రోత్సాహపఱుపఁగా నతఁడందునకంగీకరించెను. క్రొత్తగా నొకవితంతువు వచ్చినదని విని మాపురోహితుఁడామెను తానైనను వివాహముచేసికొనవచ్చుననియు, తనకు సహాయుఁడుగానుండునుగాన మేనల్లునికైనను వివాహము చేయవచ్చుననియు ఆలోచించి తన మేనల్లుని వెంటఁబెట్టుకొని మధ్యాహ్నము నావద్దకువచ్చి తన యభిమతమును దెలుపఁగా, నేనాచిన్న దానికి వారి నిరువురనుజూపి, యితఁడు పురోహితుఁడు రెండవ యతఁడు వంటబ్రాహ్మణుఁడు వీరిలో నెవ్వరియైన పెండ్లిచేసికొనుట కిష్టమున్న దాయని యడిగితిని. పడుచు వాఁడైనందున రెండవ యతనినే వివాహము చేసికొనెదనని యామెచెప్పెను. నేను వెంటనే శతమానములుచేయించి యారాత్రియే వారికి వివాహముచేసితిని. వివాహమాడిన యతనిపేరు చేబోలు వెంకయ్య. ఆఱవదియైన యీవివాహము 1883 వ సంవత్సరము మార్చినెల 13 వ తేదిని నడచినది. వరుఁడావఱకు అమలాపురములో న్యాయవాదిగానున్న పేరివిస్సయ్యగారివద్ద వంటబ్రాహ్మణుఁడుగా నుండెను. ఆన్యాయవాది స్థలనిధిసంఘములో నభికుఁడుగానుండి రెండుదినములలో కాకినాడలో జరగఁబోయెడు సభకు తాను వెళ్లునప్పటికి వంటచేసి సిద్ధముగా నుంచుటకయి యొకదినము ముందుగా తనబ్రాహ్మణునిఁ బంపెను. ఆబ్రాహ్మణుఁడు నాటియుదయమున పగలు పదిగంటలకు రాజమహేంద్రవరములో పడవదిగి మేనమామను చూచి సాయంకాలము కాకినాడపడవకు పోవలెనని