పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/247

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాల్గవ ప్రకరణము.

233



రైన తనయింటి వితంతువే నాలవ నెలలో మాయింటికి పరుగెత్తుకొనివచ్చి తనకు పతిభిక్ష పెట్టుమని నన్ను వేఁడుకొనెను. తండ్రియైన సంపర వేంకన్నగారు కొమారిత వెంటనే మాయింటికి పరుగెత్తుకొనివచ్చి విలపించుచు, మరల తన కొమారితను తనవెంటఁ బంపివేయవలసినదనియు తనకు వంటచేసి పెట్టుటకు వేఱు దిక్కు లేదనియు నన్ను వేఁడుకొనెను. వంటచేసి పెట్టుటకు వేఱొక పనికత్తెనైనను కుదుర్చుకోవలసినదనియు లేకపోయినయెడల నుద్యోగములో నున్న కొడుకువద్దను కోడలివద్దను నుండవలసినదనియు హితముచెప్పి పనినుండి తొలఁగించి కొమారితను మాయింటనే యుంచుకొని యాయన నొక్కనిని మాత్రమే పంపి వేసితిని. మంజులూరి వెంకట్రామయ్యగారు ప్రాయశ్చిత్తము చేసికొని కుటుంబసహితముగా వెడలిపోవునప్పు డిరువదియేండ్లవయస్సుగల తన తమ్ముని మాయింట దిగవిడిచిపోయిరి. నేనాతనిని మాముద్రాక్షరశాలలో నక్షరములుకూర్చుపనిలోపెట్టి నెలకాఱురూపాయ లిచ్చుచుంటిని. గోపాలమను పేరుగలయీతఁడు తనకు వివాహము చేయవలసినదని పలుమాఱు నన్ను తొందర పెట్టుచుండెను. అతని కెనిమిదిరూపాయలు జీతముచేసి, నాలుగవ వివాహమయిన యిరువదియేడు దినములకనఁగా 1883 వ సంవత్సరము జనేవరు నెల 30 వ తేదిని క్రొత్తగావచ్చిన వితంతువు నాతనికి పెండ్లిచేసితిని. ఆసంవత్సరము గోదావరి పుష్కరసంవత్సరము. ఆవఱకు తలవెండ్రుకలున్న బాల వితంతువులను సంరక్షకులు రాజమహేంద్రవరము తీసికొనివచ్చి గోదావరీ తీరమున శిరోజములు తీయించి విరూపిణులను జేయుదురు. ఆయాచారమును బట్టి పదు నేడేండ్ల యీడుగల యొకవైదిక వితంతువును తల్లియు నన్న గారును రాజమహేంద్రవరమునకు తీసికొనివచ్చి గోదావరియొడ్డుననున్న సత్రములోదిగి యుండిరి. ఇఁక తెల్లవాఱిన శిరోజములు తీయింతురనఁగా నారాత్రి యెట్లో యాచిన్నది తనవారి నేమఱిచి తప్పించుకొనివచ్చి నన్ను శరణుఁజొచ్చెను. పూర్వభర్తయుపాధ్యాయోద్యోగములో నుండినవాఁడేయయినను, తన ప్రస్తుతావస్థనుబట్టి తానెంత బీదవాఁడుగానుండిన వానినైనను వివాహము చేసికొన