పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/246

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

232

స్వీయ చరిత్రము.



ఈనాలవవివాహమయినపిమ్మట ప్రతిపక్షులు తమప్రయత్నములవలన కార్యము లేదని తెలిసికొని నిరుత్సాహులయి ప్రత్యక్షముగా బాధించుటకును కార్యవిఘాతముచేయ పాటుపడుటకును మానుకొని యుపేక్షాపరులు కాసాగిరి. ఆవఱకు వీరు నాప్రాణములకు సహిత మెగ్గు తలఁచిరి. పిండిబొమ్మలు చేసి వాని కీళ్ళలో ముళ్లుగ్రుచ్చి పసుపుతోను పిండితోను మ్రుగ్గులుపెట్టి రాత్రులు మా వీధి గుమ్మముముందు పెట్టుచుండిరి. వీధిలో చేసిన యీప్రయోగముల వలన ప్రయోజనము కలుగకపోఁగా రాత్రులు నిచ్చెనలువేసికొని మాదొడ్డిలోనికే దుమికివచ్చి దొడ్డిలోనున్న దానిమ్మచెట్టునకే యీపిండిబొమ్మలను కొబ్బరికాయ ముక్కలను కట్టఁదొడఁగిరి. తెల్లవాఱినతరువాత మాముద్రాయంత్రములోని పనివాండ్రా కొబ్బరిముక్కలను తినుచువచ్చిరి. శత్రువు లెన్నిమారణ కర్మలుచేసినను భగవదనుగ్రహమువలన నేను సిగపువ్వువాడక యధాప్రకారముగానే తిరుగుచుంటిని. నాకును గవర్రాజుగారికిని బాల్య మిత్రుఁడయిన గాడేపల్లి సుబ్బయ్యగారు కొన్ని మాసములక్రిందట నన్ను చూచుటకయి మాతోటకు వచ్చినప్పుడు వెనుకటి సంగతులు ముచ్చటించుచు పగలు సహితము నేనొంటిగా వీధిలోనికిపోయి మసలినప్పుడు నేను తిరిగి యింటికివచ్చు వఱకును నాకేమియపాయము సంభవించెనోయని భయపడు చుండెడివారమని చెప్పిరి.

బాలవితంతువులతోను వితంతువుల సంరక్షకులతోను మాటాడి వారిని ప్రోత్సాహపఱిచి సంస్కార వ్యాపనముచేయు నిమిత్తమయి నెల కెనిమిది రూపాయలు జీతమేర్పఱిచి సంపర వెంకన్న గారిని నియమించితినని చెప్పితిని గదా! ఆయన యీవితంతువుతో మాటాడితిననియు, ఆవితంతువుతో మాటాడితిననియు, ఈ సంరక్షకుని ప్రోత్సాహ పఱిచి యొప్పించితిననియు, ఆసంరక్షకుని ప్రోత్సాహపఱిచి యొప్పించితిననియు, చెప్పుచు అక్టోబరు నెలనుండి నావద్దమూడునెలలుజీతము పుచ్చుకొనెను. ఆవితంతువుమాట యీవితంతువుమాట యటుండఁగా పదునెనిమిదేండ్ల ప్రాయముగల యాయనకూతు