పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/236

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

222

స్వీయ చరిత్రము.



బంపి పెండ్లిజరగకుండఁ జేయుటకయి వివిధమాయోపాయములను పన్ను చున్న విరోధుల ప్రయత్నముల కన్నిటికిని ప్రతిక్రియలుచేసి యిదేసమయమని పెండ్లి కొమారుని బాధింపనెంచిన ఋణప్రదాతల చేతులనుండి యాతని విముక్తునిఁ జేసి పెండ్లికొమారితను జూచి మాటాడిపోవుటకయి తుదకాతనిని రాజమహేంద్రవరమునకు మరల రప్పించితిమి. ఈతనిని ఋణవిముక్తునిఁ జేయుటకయి యప్పుడిచ్చినవి యిన్నూఱురూపాయలు. పెండ్లికొమార్తె యిల్లువిడిచిన మఱునాఁడు పెద్దాపురములోనివారు మేము యుక్తవయస్సు రానిపిల్లను సంరక్షకులో వశములోనుండి దొంగిలించుకొని పోతిమని నేరము మోపి యనుగత దండవిధాయకుని యొద్ద మామీఁద నభియోగముతెచ్చిరి. ఆదండవిధాయి యీయభియోగము వితంతువివాహ సంబంధమున వచ్చినట్లు కనఁబడుచున్నదని మండల దండవిధాయకునకుఁ దెలుపఁగా నతఁ డా యభియోగమును తనయొద్దకు రప్పించుకొని విమర్శకయి సంయుక్తదండ విధాయకునియొద్దకు రాజమహేంద్రవరము పంపెను. నేను రాజకీయవైద్యుని (Doctor) మా యింటికి పిలిపించి యాయనచేత వధువును పరీక్షించి యాయనవలన వధువు పదునాఱేండ్లు దాటినదని నిర్ణయపత్రమును (Certificate) పుచ్చుకొంటిని. పెండ్లికొమార్తెతల్లి మొదలగు బంధువులు మాయింటికివచ్చి యేడ్చియు కేకలు వేసియు బెదరించియు బతిమాలియు బుద్ధులుచెప్పియు వాగ్దానములుచేసియు వధువును మరలఁ దీసికొనిపోవుటకయి నానావిధముల పాటుపడిరిగాని వారి ప్రయత్నములన్నియు విఫలము లైనందున వారు నిరాశులయి వెనుక మరల వలసినవారయిరి.

ఈసమయమునందు మాకు సహాయులయి యుండిన లక్ష్మీనరసింహము గారు సెలవుమీఁద బందరులోనుండిరి; గవర్రాజుగారు చెన్న పురినుండివచ్చి విశాఘపట్టణమునకు మాపనిమీఁదనే పోవలసినవారయిరి. లోకములో కష్టములమీఁదనే కష్టములు సంప్రాప్తములగును. ప్రథమ వివాహముచేసికొన్న గోగులపాటి శ్రీరాములు గారికిని భార్యకును సరిపడలేదనియు, తల్లి యా