పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/229

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాల్గవ ప్రకరణము.

215



ర్య స్వాములవారి కిన్నూఱు రూపాయలు ధనదండనమును విధించిరి. నా మిత్రుఁడు వ్రాసినట్టు నేననారోగ్యదశలో నుండుటయు నతికష్టపడుచుండుటయు సత్యమేకాని నాకప్పుడుండిన కార్యోత్సాహమే నాచేత ననేకకార్యములను చేయింపఁగలిగినది. వితంతువివాహ ప్రయత్న మటుండఁగా, నేను క్రొత్తగ్రంథములను రచించుచుంటిని; వివేకవర్ధనియను వారపత్రికను నడుపుచుంటిని; నగరపారిశుద్ధ్యవిచారణ సంఘమునం దెంతో చుఱుకుగా పనిచేయు చుంటిని. శాస్త్రపాఠశాలలోని విద్యార్థులు చందాలువేసికొని పుస్తకములను పలకలనుగొని, పగ లెల్ల పాటుపడివచ్చెడు బీదవాండ్ర విద్యాభివృద్ధి నిమిత్తమయి యొక విద్యాశాలలో రాత్రిపాఠశాలనుబెట్టి పాటుపడుచుండఁగా ఆ విద్యాశాలాధికారి రాత్రిపాఠశాల తనదేయని పుస్తకములు మొదలయినవానిని స్వాధీనము చేసికొనెను. గవర్రాజుగారు వ్రాసినమీఁదట పోయినపుస్తకములను మరల రాఁబట్టెడు ప్రయత్నమునుమాని, నామిత్రులు మొదలైనవారిచేత చందాలువేయించి పుస్తకాది పరికరములను కొనియిచ్చి, విద్యార్థులు మఱియొకచోట రాత్రిపాఠశాలను సాగించెడి యేర్పాటునుచేసితిని. గవర్రాజు గారు తమయుత్తరములో వ్రాసిన సంపర వెంకన్న గారిని వెంటనే పిలిపించి, నాసొంతమునుండి నెల కెనిమిదిరూపాయలు జీతమిచ్చునట్లేర్పఱచి, గ్రామముల వెంట తిరిగిపనిచేయ నియమించితిని. పట్టపరీక్షయందును ఇతర పరీక్షలయందును కృతార్థుఁడయి, మండలన్యాయసభ (District Court) యందు సిరస్తాదారు పదమునొంది, కడపట న్యాయావాదియయి, మరణపర్యంతము నన్ను విడువకుండిన దీ గవర్రాజుగా రొక్కరే.

పెద్దాపురమునందు నామిత్రులయిన మనోహరము పంతులు గారుండిరని చెప్పియుంటినిగదా ? వితంతు వివాహపక్షమునం దత్యంతాభిమానము కలిగి యుత్సాహముతో పనిచేయుచుండిన యాయన తమ్ముడైన గుమ్మడిదల సాంబశివరావుగారు రాజమహేంద్రవరమునుండి యాచిన్న దాని నిమిత్తము పనిచేయుటకు తఱుచుగా నన్న గారియొద్దకు వెళ్ళుచు, నాయుత్తరముల నాచిన్న