పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/224

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

210

స్వీయ చరిత్రము.



మాలుకోఁగా మాతో మనసిచ్చి మాటాడక పోవుటయేకాక మామీఁద కోపపడి యట్టియనుచిత ప్రసంగమును చేసినందుకు మమ్ము తిట్టసాగిరి; మఱికొందఱు మమ్ము తమయిండ్లలోనికే రానీయకపోయిరి. వేంకటప్పయ్యగారు చెన్నపట్టణమునకు పోవుచు కాకినాడనుండి వ్రాసినయుత్తరములో నుదాహరింపఁబడిన పెద్దిభట్ల యజ్ఞన్న గారును ప్రాధమికపాఠశాలలో నుపాధ్యాయుఁడైన తాడూరి రామారావుగారును నేను వ్రాసినమీఁదట రాజమహేంద్రవరమువచ్చి నాతోమాటాడి మొదటివారు తమచెల్లెలిని స్వశాఖవాఁడయిన వైదికవరునకిచ్చి వివాహము చేయుటకును, రెండవవారు స్వశాఖదియైన మాధ్వవితంతువును వివాహమాడుటకును, అంగీకరించిరి. కాఁబట్టి యిప్పుడొక వైదికవరుఁడును, ఒకమాధ్వవధువును గావలసియుండిరి. వైదికవరుఁడు మా పాఠశాలలోని విద్యార్థులలో నొకఁడు సంసిద్ధుఁడయియే యుండెను; మాధ్వ వధువు సహితము లభించినట్లేయుండెను. ఉమ్మెత్తాల వేంకటపతిరావను మాధ్వగృహస్థుఁ డొకఁడు నాతో నావఱకు పలుమాఱుమాటాడి 1882 వ సంవత్సరము జూన్ నెల 24 వ తేది నాకీక్రిందియుత్తరము వ్రాసియిచ్చెను.

"మీరు యిదివరలో వితంతువివాహములు చేయించినారని యిట్టి శాస్త్రోక్తమయ్ని లోకోపకారం జరిగించినందుకు చాలాసంతోషంగా వున్నది. నాకుమార్తె అయిన శనగవరపు లక్ష్మీబాయమ్మకు భర్తచనిపోయినాడు. దానికి సుమారు 16 సంవత్సరములు వయస్సుకలిగియున్నది. తిర్గీవివాహంచేతామని ఆలోచిస్తే నాకు ద్రవ్యోపపత్తిలేదు. నీరసుణ్ని. దానికిముఖ్యంగా వివాహం చేసుకోవలెనని వుద్దేశంవున్నది. మామతస్తుడయ్ని చిన్నవాడు యెవరైనా మీకుకనిపించి యింద్కు అంగీకరించ్చిన పక్షముకు అతనికి సదరు లక్ష్మీబాయమ్మను వివాహంచేశి మీరు నాకు కర్చు లేకుండా జరిగించినపక్షమున నేను చాలాసంతోషిస్తున్నాను గన్కు విశదంని|| వ్రాశినాను. చిత్తగించవలెను. తేది 24 జూన్ 1882 సం|| వుమ్మెత్తాల వెంకటపతిరావు."