పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/221

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాల్గవ ప్రకరణము.

207



పట్టెడ మాయమయినది ; మాయింటఁగల చిన్న వస్తువులును నేను ధరించెడు వస్త్రములును పెక్కులు మాయింటినుండి తరలిపోవుచువచ్చినవి. ఇంటిదొంగను పట్టుకొనుటకష్టముగదా ! అనుమానపడి యేమయిననన్న పక్షమున మేము ముందులిచ్చిన నూఱురూపాయలును పోవునేమోయన్న భయమొకటి, వాఁడు పాఱిపోయిన వంటబ్రాహ్మణుఁడు దొరకఁడన్న భయమొకటి, సంవత్సరము జీతమిచ్చెదమని వ్రాసియిచ్చి చేసినప్రతిజ్ఞను నడుమను మీఱకూడదన్న భయమొకటి, మమ్ముబాధింపఁగా ప్రత్యక్షమయిన రుజువు దొరకువఱకును చూడవలెనని మేమప్పటిస్థితినిబట్టి వానినుపేక్షించుచువచ్చితిమి. ఆబ్రాహ్మణుఁడు మేము చెన్నపట్టణములో నున్నప్పుడు మా ముద్రాక్షరశాలలో పనిలోనున్న మునిసామి యనువాని కత్తెర మొదలయినవానిని తస్కరింపఁగా, అతఁడు గదిలోపెట్టి దిట్టముగా కొట్టినందున వంటబ్రాహ్మణుఁడు భయపడి మునిసామిని తనవెంట తానుంచుకొన్న ముండయింటికి తీసికొనిపోయి యాతని వస్తువుల నిచ్చివేసెను. ఆవస్తువులతోడిపాటుగా పోయినవస్తువులు మావిసహితము కొన్ని దొరకినవి. మునిసామికిజడిసి యాబ్రాహ్మణుఁడు మమ్మువిడిచి పాఱిపోయెను. వివాహములుచేయించి విశాఘపట్టణమువెళ్లిన పురోహితుఁడును ప్రాయశ్చిత్తము చేయించుకొని స్వజనమునుచేరెను. ఈ ప్రకారముగా మాయింటనున్న పైజనమంతకంతకు తగ్గిపోయి పలుచఁబడినది. నేను చెన్నపట్టణము వెళ్లఁదలఁచుకొన్నప్పుడు ఏప్రిల్ నెలలో ప్రయాణవ్యయముల నిమిత్తము రామకృష్ణయ్యగారునాకిచ్చిన నూఱురూపాయలను ఆమాస వ్యయములక్రింద కర్చు చేసితిని. ఆమాసమునకయిన వ్యయముల నిందు క్రిందఁజూపుచున్నాను -

రామచంద్రరావు(రెండవపెండ్లికొడుకు)నకు భోజనమునిమిత్తము రు. 7-0-0

రామచంద్రరావుకు పుస్తకములు రు. 2-0-0

రామచంద్రరావుకు స్కుల్లుఫీజు రు. 6-1-0

రామచంద్రరావుకు జంపుఖానా రు. 1-10-0

రామచంద్రరావుకు కట్టుబట్టలు రు. 5-1-6