పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/220

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

206

స్వీయ చరిత్రము.



ముగా ముగిసినతరువాత చెంచలరావుపంతులుగారు మాందఱకు క్రొత్త బట్టలను కట్టనిచ్చి, ప్రయాణవ్యయములకయి నూఱురూపాయల రొక్కమిచ్చి, మమ్ము వీడుకొల్పఁగా జూన్ నెల నడుమను సుఖముగా మరల రాజమహేంద్రవరము చేరితిమి. శ్రీరాములుగారికి గర్భాధానముచేసి యాయపత్నీసహితముగా విశాఖపట్టణమునకు మరలఁ బంపివేసితిని.

ఇట్లు మిత్రద్రవ్యముతో మూడుపక్షములు విందులారగించి స్వేచ్ఛావిహారముచేసివచ్చి స్వస్థలముచేరి మాయెప్పటి వ్యవహారములలో మరల మేము ప్రవేశించితిమి. పలుచోట్లనుండి వచ్చి బహువిధాభిప్రాయములను గలిగినవా రెక్కువమంది యొక్కచోట కూడినప్పుడు వారిలో నైకమత్యముండుట యరుదుగదా ! అట్టివారిలోఁ గొందఱిని వేఱుచేయవలసిన యావశ్యకము శీఘ్రకాలములోనే సంభవించెను. ఈపక్షములోఁ జేరినవారి కితరులు కాపురముండుట కిండ్లియ్యరు. రామకృష్ణయ్యగారిక్కడకు వచ్చినప్పుడీచిక్కు వారితో చెప్పఁగా, వివాహము లాడినవారును తత్సంబంధులును కాపురము లుండుటకయి యిన్నీసుపేటలో వారొకగృహమును కొనియిచ్చిరి. నెల కెనిమిదేసి రూపాయలు జీతము లేర్పఱిచి ముందుగా రెండవపెండ్లికొమారిత పుట్టినింటివారిని, తరువాత రెండవ పెండ్లి దంపతులను, ఆయింటికిఁ బంపితిని. రామకృష్ణయ్యగారు ప్రాయశ్చిత్త మంగీకరించినతరువాత మంజులూరి వెంకట్రామయ్యగారు తనతమ్ముని మాయింటదిగ విడిచి, ప్రాయశ్చిత్తము చేయించుకొని భార్యతోను కుమారునితోను మాయింటినుండి వెడలిపోయిరి. నల్లగొండ కోదండరామయ్యగారు తమతల్లికి జబ్బుచేసినందున జూలయినెలలో ప్రాయశ్చిత్తము చేయించుకొనిపోయి బంధుజనములోఁ గలిసిరి. వంటబ్రాహ్మణులలో నిద్దఱుకూడ మాయిల్లు విడువవలసినవారయిరి. వారిరువురిలో నొకఁడు హస్తలాఘవ విద్యయందు నిపుణుఁడు; ఆతనిశక్తిచేత మాయింట నే వస్తువును పెట్టి కొంచెమేమఱి యుండినను, ఆవస్తువు నిమిషములో నదృశ్యమగుచు వచ్చెను ; మొదటి పెండ్లిదినములలోనే మొదటి వధువునకుపెట్టిన బంగారు