పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

10

స్వీయ చరిత్రము.

యట్లుండఁగా వారుధనకాములు గాక కీర్తికాములయి పండితుల నాదరించియు దానధర్మములు చేసియు విశేషయశోధనమును సంపాదించినవారు. ఆయనయొద్దఁ బురాణము చెప్పెడు శాస్త్రులయొద్దనే నేను గాళిదాసత్రయమును జదివినాఁడను. ఆయన యాంధ్రభాషాభిమానము గలవారయి యింట భోజనము పెట్టి జీతము లిచ్చి సమర్థు లయినవారిని నిలిపి వారిచేత భారతభాగవత రామాయణములను గొన్ని పురాణములను గొన్ని ప్రబంధములను వ్రాయించిరి. ఆతాటాకులపుస్తకములు కొన్ని నాకాలములోనే శిథిలములయినవి; అచ్చు పడినతరువాతఁ గొన్నిటిని నేనే యితరులకు దానము చేసితిని. ఆపదలు రా నారంభించినప్పు డొక్కదానితోఁ బరిసమాప్తి కాదు. ఆయన పని పోయి యార్జనము లేక యున్న కాలములోనే పూర్వ మంతవైభవముతో వివాహము చేసిన ప్రధమకుమారునికి కళత్రవియోగము తటస్థించెను. కుమారునకు మరల వివాహము చేయవలె నన్న ప్రయత్నములో నుండఁగానే యొక నాఁటిరాత్రి భోజనము చేసి శయనించినతరువాత గుండెలలో నొప్పి వచ్చి తెల్లవారునప్పటికి మాతాతగా రాకస్మికముగా స్వర్గస్థు లయిరి. మరణకాలమునం దాయనకు జననియైన యక్కమ్మగారును, భార్యయైన కామమ్మగారును, జ్యేష్ఠపుత్రుఁడు వేంకటరత్నముగారును,ద్వితీయపుత్రుఁడు సుబ్బారాయఁడు గారును, ఉండిరి. నేను ద్వితీయపుత్రునిపుత్రుఁడను. నా పెదతండ్రి గారికి వయ్యస్సప్పుడిరువదియైదేండ్లు; తమ్ముఁడన్న గారికంటె మూడునాలుగు సంవత్సరములు చిన్నవాఁడు. సిరి చచ్చినను చిన్నెలు చావవన్న లోకోక్తి యున్నదేకదా! విత్త మంతగా లేక పోయినను సాధారణముగా గొప్పయింటఁ బుట్టినవారి కుండెడుగర్వమును మేము పనినిమిత్త మితరుల నాశ్రయింతుమా యన్న దురభిమానమును మాత్రము మా తండ్రులను విడిచినవికావు. మా పెదతండ్రిగారి ద్వితీయవివాహముతో మున్నున్న విత్తము కొంతయు నంతరించినది. తరువాత గృహవ్యయములనిమిత్తమయి మా తండ్రులు మొట్ట మొదట మాతాతగా రిల్లు పెంపు చేయుటకొఱకు నిలువయుంచిన కలపను విక్రయించి