పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/218

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాల్గవ ప్రకరణము.

203



మైలాపురములో కచ్ఛపేశ్వరుని యాలయసమీపమున మాకయి యేర్పఱిచిన విశాలగృహమునందు ప్రవేశపెట్టిరి. మాకేవిధమైన లోపమును లేకుండ సమస్తమును సమకూర్చుచు పంతులుగారు మాయెడల నత్యంతాదరము చూపిరి. నేనును సుఖభోజనముచేయుచు పంతులుగారు పంపిన గుఱ్ఱపు బండ్లమీఁద పోయి యక్కడ నుపన్యాసములిచ్చుచు రఘునాధరావుగారి రాకను ప్రతీక్షించుచుంటిని. నేనొకసారి చాకలిపేటలో వితంతు వివాహమునుగూర్చి యుపన్యసించు చుండఁగా మూర్ఖులయిన వైష్ణవబ్రాహ్మణులు చుట్టుముట్టి నన్ను మర్దింపఁజూచిరిగాని నా మిత్రులైన పనప్పాకము ఆనందాచార్యులు గారు యుక్తసమయములో కనిపెట్టి నన్నక్కడనుండి తొలఁగించి తమబండిలోనెక్కించుకొని దూరముగాఁ గొనిపోవుటచేత వారిబారినుండి తప్పించుకొంటిని. ఇంకొక్కసారి నేను పెద్దినాయనిపేటలో(Blacktown) నుపన్యసించుచుండఁగా పండితు ల నేకులుచేరి యుపన్యాసాంతమున ప్రశ్నలు వేసి నన్ను పరాభవింపనెంచి, వితంతువు వివాహముచేసికొన్నచో దాని పూర్వభర్తయొక్క శ్రాద్ధము లెవ్వరు పెట్టుదురనియు, ఆశౌచమెట్లు పట్టవలయుననియు, ఇట్టివే యనేక ప్రశ్నములు వేసిరి. నేను వానికన్నిటికిని శాస్త్రోక్తములయిన సమాధానములను చెప్పితిని. ఈ విధముగా నన్నోడింప లేక భగ్న మనోరథులయి కడపట "మీకు శాస్త్రములయందు విశ్వాసమున్నదా?" యని ప్రశ్న వేసిరి. "లేదు. ఆత్మసంరక్షణార్థమును శాస్త్ర విశ్వాసముగలవారి నిమిత్తమును నేను శాస్త్ర ప్రమాణములను జూపుచున్నాను." అనిచెప్పి, పూర్వమొక గ్రుడ్డివాఁడు దీపము చేతఁబట్టుకొని దారినిబోవుచు నీకదియేమి యుపయోగమని దారినిపోవువా రడిగినప్పుడు మీకు దారికనఁ బఱుచుటకును చీఁకటిలో కనఁబడక మీరు నామీఁదఁబడి యపాయము కలిగింపకుండ నన్ను కాపాడుకొనుటకును దీనిని వహించుచున్నానని యుత్తరము చెప్పిన కథను దృష్టాంతము చూపితిని. ఇంకొకసారి తిరువళ్లికేణిలో గంగనామంటపముమీఁద జరిగిన పండితసభలో కంచి సుబ్బారావుపంతులు