పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/213

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

198

స్వీయ చరిత్రము.



ముందుపరుగెత్తినవారి యవస్థనుజూచి వెనుకటివారు తాము వారిదాడి పట్టక ప్రాణరక్షణార్థమయి గోదావరిలోదిగి కంఠములోఁతువఱకును పాఱిపోయిరి. విద్యార్థులు కొందఱు వారిని వెంబడించిపట్టుకొని నీటిలోముంచి లేవనెత్తి కొన్నినిమిషములు వారి తలలను మద్దెలలనుగాఁజేసి వినోదించి తమతోడి విద్యార్థి నన్యాయముగాకొట్టిన ఋణమును వడ్డితోడఁగూడ తీర్చుకొనిరి. మొట్టమొదట దెబ్బలుతిని తప్పించుకొనిపోయిన యిద్దఱుశిష్యులును వాయువేగమున పరుగెత్తి స్వాములవారి సన్నిధానముచేరి కన్నీటితో పాదములు కడుగుచు హూణవిద్యాశాలలోని బాలురవలన జగద్గురువుయొక్క శిష్యులకు సంప్రాప్తమయిన కష్టపాటును విన్న వించుకొని, అక్కడనున్న రక్షకభటుల తోడ కొన్ని నిమిషములలో మరల యుద్ధభూమినిచేరిరి. రక్షకభటు లా శూరులతో రణరంగమును చేరునప్పటి కక్కడ నిన్నూఱుగురు విద్యార్థులకంటె నధికముగాచేరియుండిరి. నీటిలోనున్న విద్యార్థు లా రక్షకభటులను జూచి శిష్యులనువిడిచిపెట్టి తాము నీటిలోమునిఁగి యీఁది మఱియొక రేవున తేలి యింటికిపోయిరి. చేతిలోనిపాత్రలను నీటిలో పోఁగొట్టుకొని యపాత్రులయి యున్న యాశిష్యులను వెంటఁబెట్టుకొనిపోయి రక్షకభటులు వారిని స్వాముల వారితోఁ జేర్చిరి. స్వాములవారు శిఖాయజ్ఞోపవీతములను విసర్జించినను రాగద్వేషాదులను మాత్రము విసర్జింపనందున శిష్యులకు సంభవించిన దుర్దశ నిమిత్తమయి కొంతసేపువిలపించి యావిద్యార్థులను శపించి యూరివారు తమ్మువచ్చి ప్రార్థించి యలుకతీర్చెదరేమోయని పీఠమునువిడిచి లేచిపోయెదమని వారికిని వీరికిని సమాచారములు పంపిరి. ఆరాత్రి బడిపిల్లలు స్వాములవారి శిష్యులను కొట్టి చంపిరనియే పట్టణములో ప్రవాదముపుట్టెను. అందుచేత విధవా వివాహములకు ప్రతిపక్షులు గానున్న వారు వీధులలో మొగము చూపుటకే తెగింప లేకపోయిరి. నేనాసమయమున చల్లగాలి ననుభవించుచు మారేవున గోదావరిలోని యొకపడవమీఁదఁ గూరుచుండియుండుటచే ప్రొద్దుపోయి యింటికి పోవువఱకును నాకీవార్తయే తెలిసినదికాదు. ప్రథమశాస్త్ర పరీక్షనిచ్చి