పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మొదటి ప్రకరణము.

9

వాసము చేయుటకయినను జాలినదైనను మాతాతగా రత్యుచ్చదశలో నున్నప్పుడది చాలక యింకను వృద్ధిచేయవలెనని కలపఁ దెప్పించి నిలువఁ జేసిరఁట! బెల్లమున్న చోట నీఁగలు ముసురునట్లు తమవాఁ డొకడు మంచిదశలో నున్నప్పు డెక్క డెక్కడివో తరములనాటి బంధుత్వములు తెలుపుకొనుచు వచ్చి బంధువులాతని నాశ్రయింతురు. అట్టి చుట్టములతో మాతాతగారియిల్లు సదా నిండియుండెడిదఁట! ఇట్లు మహోన్నతదశలో నున్నకాలమునం దాయన పూర్వార్జితము లయినభూములను జ్ఞాతులకుఁ గొన్నిటిని విడిచిపెట్టి తక్కిన వానిని విద్వాంసులకు దానము చేసెను. ఎల్లకాలమును దినము లేకరీతిగా నుండవు. వెన్నెలదినము లయినతరువాత చీఁకటిదినములు రాకుండునా? ఆకాలమునందు రాజకీయనియోగులలోఁ బరోత్కర్షాసహిష్ణుత సర్వసామాన్య మయుయుండెను. చూచువారికన్నులు కుట్టునట్టుగా నంత గొప్పయిల్లు కట్టుట చూచి యోర్వలేక యసూయాపరులగు తోడినియుక్తులు కొందఱు కుతంత్రములు పన్ని కొండెములు చెప్పి తమ కపటప్రయోగమునై పుణిచేత మా తాతగారిని పనినుండి తొలఁగించునట్లు చేసిరఁట! అప్పుడాయన యాశ్రిత భరణమును స్వకుటుంబభరణమును పూర్వార్జితవిత్తముతోనే చేయవలసివచ్చెను. ఆయన తా నార్జించినధనమును విశేషముగా నిలువచేసికొనలేదు. బంధుపోషణము నిమిత్తమును దానధర్మములనిమిత్తమును సంపాదించిన విత్తములో విశేషభాగము నెప్పటిదప్పుడే యాయన వెచ్చ పెట్టుచుండెను. అంతేకాక తన పెద్దకొమారుని ప్రథమవివాహమును మహావైభవముతో నడపి యన్న ప్రదానములు భూరిదానములు మొదలయినవానికయి ధనవ్యయ మత్యధికము గాఁ జేసెను. రొక్క మధికముగాఁ జేర్పఁ గలుగుట కాయన మొదటినుండియు పెద్దపనులనే చేసినవాఁడు కాఁడు. చిన్న పనితో నే యారంభించి స్వసామర్థ్యము చేతఁ గ్రమక్రమముగా వృద్ధినొంది కడపట గొప్పపనికి వచ్చెను. ఆకాలమునందలి యల్పసంస్థానాధిపతులయొద్ద నున్న గొప్ప యధికారులకు నూఱు రూపాయల జీత మిచ్చుట యిప్పుడు పదివే లిచ్చుట కంటెను గొప్ప. అది