పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/207

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

192

స్వీయ చరిత్రము.



శ్రీరాములుగారు కొంత స్వస్థపడినతరువాత జనేవరు 31 వ తేదిని బైలుదేఱి ముందుగా రామసోమయాజులు వచ్చి వేసెను ; వేంకటశాస్త్రిగారు వచ్చు వఱకునునుండి కోదండరామయ్యగారు తిరిగివచ్చిరి. ఆయనరోగము మళ్లి కుదురుముఖమునకు వచ్చు చున్నదను వఱకును నాగుండె కుదుటఁబడలేదు. మిత్రవిషయమయి యెంతో కష్టపడినందుకు కోదండరామయ్యగారికి నాకృతజ్ఞతను దెలుపుచున్నాను.

మాప్రతిపక్షులు మాకొత్తుడు కలుగఁజేయుటకును మాయుద్యమములకు విఘ్నములు కలిగించుటకును ఏయే సాధనములున్నవో వానినెల్ల మాయెడల ప్రయోగింపక విడువలేదు. ఆకాలమునందలి రాజకీయోద్యోగులలోని లంచములు మొదలైనయకృత్యముల నణఁచుటకును కులములోని దురాచారములను మాన్పుటకును సంఘసంస్కారములను దేశమునందంతటను వ్యాపింపఁజేయుటకును మాచేతిలో వివేకవర్ధనీపత్రిక యమూల్యాయుధముగానుండెను. దానిని రూపుమాపినఁగాని మాపక్షము దుర్బలముకాదని మాప్రతిపక్షులు తలఁచి, పత్రికా ప్రకటనమునకు మూలమయిన ముద్రాశాలభాగస్థులను ప్రేరేచి ముద్రాయంత్రము పనిని నిలుపునట్లుచేసిరి. భాగస్థులలో నే నొకఁడను ; రెండవవాఁడయిన నామిత్రుఁడు రాజామంత్రిప్రెగడ దుర్గామల్లికార్జున ప్రసాదరావు బహదూరుగారు కాలధర్మము నొందుట తటస్థించెను ; తక్కిన నలుగురును సంస్కారవిషయమున నాప్రతిపక్షకోటిలోనివారు ; వారిలో సరిపల్లె గోపాలకృష్ణమ్మగారు వితంతు వివాహవిపక్షయోధులకు ప్రధాననాయకుఁడు. పూర్వాచార పరాయణుఁడైన చల్లపల్లి రామబ్రహ్మముగారు నాతోడఁగూడి పనిచేసిన బాపయ్యగారి జ్యేష్ఠభ్రాత ; నాళము కామరాజుగారును పందిరి మహాదేవుఁడుగారును రామ బ్రహ్మముగారి చేతిలోనుండి యాయన నడిపించినట్లు నడుచువారు. ఈకడపటివారు నలుగురునుజేరి పని మానిపించిరిగాని ముద్రాశాలను నాయొద్దనుండి తొలఁగించుటకు శక్తులు కాకపోయిరి. వారు ముద్రాయంత్రమును విక్రయింపవలెనని తమ యభిప్రాయమును దెలుపఁగా