పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/200

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాల్గవ ప్రకరణము.

185



వాఁడనగుటచేత స్వాములవారిపై నభియోగము తెచ్చుటకు నేనొప్పుకొనలేదు. ఆత్మూరి లక్ష్మీనరసింహముగారు స్వాములవారిపై నభియోగము తెచ్చిరికాని యది కొట్టుపడిపోయినది. ఇది యిట్లుండఁగా విశాఖపట్టణములో ప్రధమ వివాహముచేసికొన్న గోగులపాటి శ్రీరాములుగారి నీవిషయమున దూషించినారని కొందఱిప్రముఖులమీఁద దర్భా వేంకటశాస్త్రిగారు మొదలైనవా రాయనచేత మాననష్టమున కభియోగము తెప్పించి యోడిపోయినందున గొప్పవారితో వైరము సంపాదించుకొనుటతప్ప వేఱు ప్రయోజనము కలుగకపోయెను. సభలకెక్కక యుపేక్షచేసి యూరకుండుటకు మాఱుగా సభలకెక్కి యోడిపోవుట మాపక్షమున కధికానర్థదాయకమయినందున క్రొత్తగా వచ్చిన యనర్థమువలని దుష్ఫలములను తొలఁగించు విషయమున నేనును పనిచేసి యుపర్యభియోగాదుల విషయమయి పాటుపడవలసినవాఁడనైతిని. స్వాములవారిపైతేఁబడిన యభియోగము కొట్టుపడిపోవుటచేత మాప్రతిపక్షులు విజయ గర్వితులయి మాపక్షమువారిని మఱింతలోకువచేసి గేలిచేయసాగిరి. ఏవంకఁ జూచినను కష్టమేఘములును విద్వేషాకాలవాయువులును చుట్టుకొని యంధకార బంధురములయి యాదినములు స్త్రీ పునర్వివాహ విధాయకపక్షమువారికి దుర్దినములుగానుండెను. ఆవఱకు వితంతువివాహములు చేసెదమని ముందుకు వచ్చినవా రిప్పుడాపేరునైన తలపెట్టక పిలిచిననుపలుకక పలాయితు లైరి. అభియోగము కొట్టుపడినతరువాత ఆత్మూరి లక్ష్మీనరసింహముగారు వైష్ణవమత ప్రవిష్టులయి ప్రాయశ్చిత్తముచేసికొనఁగా, వారు వితంతు వివాహపక్షమున పనిచేసినందుకే ప్రాయశ్చిత్తము చేసికొనిరని ప్రతిపక్షులును పామరులును పలుకఁ జొచ్చిరి. వైష్ణవమతప్రవేశమున కావశ్యకమయినందుననే ప్రాయశ్చిత్తమును జేసికొంటిమికాని యదియిందుతో నెంతమాత్రమును సంబంధించినది కాదనియు, తాము వెనుకటివలెనే వితంతువివాహముల విషయమున శ్రద్ధవహించెదమనియు, వారు వివేకవర్థనికి లేఖవ్రాసిరికాని తరువాత వివాహములు జరగునప్పుడుమాత్ర మెప్పుడునురాలేదు. అయినను వివాహములతో సంబం