పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/199

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

184

స్వీయ చరిత్రము.

చిత్రపుకామరాజుగారి వ్యవహారములో వేశ్యాంగనాసంభోగ సౌఖ్యమున కాశపడి కాగితపుముక్కల నిచ్చి వేసిన న్యాయవాది యిందుదాహరింపఁబడిన నాగవరపు-రామమూర్తియను మహాపురుషుఁడే.

ఆపదలు వచ్చినప్పుడు మేము ధైర్యముతో నిలుతుమో పిఱికి పందలమయి ధర్మపక్షమును విడిచి తొలఁగుదుమో శోధించుటకయి యీశ్వరుఁడు పంపిన శోధనలోయనునట్లుగా మమ్మన్ని ప్రక్కలను కష్టములే యెదుర్కొన నారంభించెను. స్వాములవారు పంపిన బహిష్కారపత్రికలు పెద్దపులులవలె బెదరింపఁగా నావఱకు ముందంజెవేయు వారందఱును వెనుకంజెవేసి మా ధైర్యవచనములను చెవినిబెట్టక మాకు విముఖులయి పూర్వాచారాపరాయణుల మఱుఁగునకు పలాయితులుకాఁజొచ్చిరి. భయకంపితులయియున్న యిట్టి వారి భయముడిపి వారికి మరల ధైర్యముపుట్టించి వారిని సుముఖులనుజేసి మరల మనవంక కాకర్షించుటకుఁ దగినప్రతిక్రియను కార్యము మించకముందే యాలోచించి ప్రయోగించుట కర్తవ్యమని మాలోనివారు నిశ్చయించి, శంకరాచార్యస్వాములవారిమీఁద మాననష్టమునకయి యభియోగము తెచ్చుటయే దానికి తగినమందని నన్నా పనికి పురికొల్పిరి. మనుష్యమాత్రు లెవ్వ రెంతమంది శత్రువులయి యెన్ని విఘాతములుచేయఁ బాటుపడినను మనముపూనినకార్యము మంచిదియు నీశ్వరప్రీతికరమయినదియు నయినపక్షమున ధర్మబలముచేతను దైవబలముచేతను కడపట కార్యసాఫల్యము కాకమానదనియు, విరోధులయపకృతికి ప్రత్యప్రకృతి యక్కఱలేకయే విజయమునొందవచ్చుననియు, నమ్మిన