పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/181

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాల్గవ ప్రకరణము.

167


ఈయాకస్మికసంక్షోభములో తామంతకుముందు పేరులేక మూలఁ బడియున్న యనామధేయు లనేకులు సుప్రసిద్ధు లయినారు ; వివాహములలో తోరణములు త్రెంపి పెనఁగులాడి చేతులువిఱిచి సంభావనలు గొను మహాపురుషులు పెద్దసభాపతులయినారు ; ఇచ్చకములాడి యింటింటఁదిరిగి బిచ్చ మెత్తుకొను తుచ్ఛలు సందడిగాతిరిగి సమాచారములు తెచ్చుట కెంతో పెద్దలయినారు. వీరి యాటోపమునుజూచి నామిత్రులు సహితము కొందఱు నాతో మాటాడుటకే భయపడిరి ; స్త్రీ పునర్వివాహ విషయమయి తమ ప్రాణములనైన నిచ్చెదమని దంభములు పలికి యితరులకు లేఖలు వ్రాసిన వారును, ఆంతరంగిక సమాజములో చేరియున్న వారును సహితము పెండ్లికి వచ్చుటమాటయటుండఁగా మావీధిని నడుచుటకే జంకుపడి కార్యస్థానాదులకుఁ బోవునప్పుడు చుట్టుతిరిగి వేఱుదారులఁ బోవువారైరి. పామరులవలని భయముచేత మాయింట వంటచేయు బాపనపనికత్తె మమ్మావఱకే విడిచిపెట్టెను ; పురోహితుఁడు మాయింట శుభకర్మలు చేయించుటకయి రాక మానుకొనెను ; బంధువులందఱును నన్ను బహువిధముల నిందించుచు జాతిభ్రష్టునివలె చూడసాగిరి ; వివాహదినమున మాయింటమాత్రమేకాక మాయింటిచుట్టును మావీధి పొడుగునను రక్షకభటులు కావలి కావవలసివచ్చినది. ఇటువంటి మహాసంక్షోభములో 1881 వ సంవత్సరము డిసెంబరు 11 వ తేదినిరాత్రి రాజమహేంద్రవరములో మొదటి స్త్రీపునర్వివాహము జరగినది.

ఆవివాహమునకు మొదటినుండియు నాతో నుండి పనిచేసి ప్రప్రథమమున నన్నీ కార్యమునకుఁ బురికొల్పిన మిత్రుఁడు చల్లపల్లి - బాపయ్యగారు రానేలేదు. ఆయన పామరజన దూషణమునకు భయపడిగాని యీకార్యమునం దాదరము తగ్గి గాని వివాహ సమయమున వచ్చుటకు మానుకోలేదు. ఆయనయన్న లిద్దఱును నాటిరాత్రి యాయనను బలవంతముగా నొక గదిలో పెట్టి తాళమువేసి నిర్బంధించి యీవలకు రానీయకపోయిరి. పెద్దన్న గారయిన రామబ్రహ్మము గారు పూర్వాచార్ర పరాయణుఁడును వితంతు వివాహ