పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/174

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

160

స్వీయ చరిత్రము.


మిత్రులలేఖ లిటువంటివి పెక్కులున్నను, ముందుపనికయి దీనిని మాత్ర మిచటఁ బ్రచురించుచున్నాను. ఇది యిట్లుండఁగా కృష్ణామండలములోని తిరువూరు డిప్యూటీ తహస్సీలుదారుగా నుండిన బ్రహ్మశ్రీ దర్భా బ్రహ్మానందముగారు తమతాలూకాలోని యొకగ్రామములో పండ్రెండేండ్ల యీడుగల యొకవితంతు బ్రాహ్మణకన్యయున్న దనియు, తగుమనుష్యులను పంపఁగలిగినయెడల తల్లిని సమ్మతిపఱచి యాచిన్న దానిని వారివెంటఁ బంపునట్లు ప్రయత్నముచేసెదమనియు, నాకొకలేఖను వ్రాసిరి. ఈ విషయమయి కొంతయుత్తరప్రత్యుత్తరములు జరగినతరువాత నామిత్రుఁడు తిరువూరినుండి 1881 వ సంవత్సరము నవంబరు నెల యైదవ తేదిని నాకిట్లువ్రాసెను.

"మీ యుత్తరములు యుక్తకాలములోనే నాకు చేరినవి. ఆబాల వితంతువుయొక్కతల్లి తనగ్రామమునువిడిచి బంధువులనుజూచుటకయి పోయినందున, ఆమెతో మాటాడి యింతకంటె ముందుగా మీకు ప్రత్యుత్తరము పంపలేక పోయితిని. ఆమెతో నేనిప్పుడేమాటాడితిని. అక్కడకుఁ దీసికొని పోవుటకు మీ రిక్కడకు మీ మనుష్యులను బంపినతోడనే తన కొమారితను మీవద్దకుఁ బంపెదనని యామె వాగ్దానముచేసినది. ఆచిన్న దానిని వెంటఁ బెట్టుకొనిపోవుటకు నమ్మఁదగినవారును ఋజువర్తనులును దృఢచిత్తులునయిన మనుష్యులను బంపుఁడు. వారు విషయము నత్యంతరహస్యముగా నుంచవలెను. వారు కపటవేషధారులైనపక్షమున, వారుమనకార్యమునకు భంగము కలిగించుట నిశ్చయము. వారిని నిజముగా మనపక్షావలంబులను గాఁ జూడుఁడు. వివాహము నిజముగా జరగువఱకును వారెందునిముత్తము వచ్చిరో యాపని యిక్కడ నెవ్వరికిని దెలియకుండవలెను. ఈపనినిమిత్తమయి యిద్దఱికంటె నెక్కువమనుష్యులను పంపవలదని సీతమ్మ (బాలవితంతువు తల్లి) మిమ్ముకోరుచున్నది. మనప్రయత్నములు కడపట మరల సంపూర్ణభగ్నతను పొందవచ్చునని యామెకూడ తలఁచుచున్నది. వివాహము నిమిత్తమయి తన లిఖితానుజ్ఞను మీకిచ్చుటకుకూడ నామె యొప్పుకొనియున్నది. మా మను