పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/172

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

158

స్వీయ చరిత్రము.


"గౌరవనీయుఁడవైన మిత్రుఁడా ! .............. నేను పెద్దిభట్ల యజ్జన్నగారితో మాటాడినాను. అతఁడు తనవితంతుసోదరిని స్వశాఖవాఁడయి వృద్ధికి రాఁదగిన చిన్నవాని కెవ్వనికైననిచ్చి వివాహము చేయుటకు సంసిద్ధుఁడయి యున్నాఁడు. నాలుగయిదు మిధునములనుమాత్రము గలదయిన పక్షమున మొదటిగణములోనే చేరుటకు సహితమతఁడు సంసిద్ధుఁడయి యున్నాఁడు. అతఁడు వెనుకతీయఁడని మీరు నమ్మియుండవచ్చును. ఆతని మేనమామలును తక్కినపెద్దలును పయికిమాత్ర మసమ్మతిని కనఁబఱచునట్లుందురుగాని కడపట మనపక్షమువారుగానే యుందురని నాకు రహస్యసమాచారము తెలిసినది. ఈయుత్తరము చేరినతత్క్షణమే మీవద్దకు రావలసినదని యజ్ఞన్న గారికి వ్రాయుఁడు మీ యొద్దనుండి యుత్తరము వచ్చినతరువాత మిమ్ముపోయి కలిసికొని యావశ్యకములైన యేర్పాటులన్నియు చేయుటకీతఁడు వాగ్దానము చేసియున్నాఁడు.

నేనొకవ్యాపారి (మాధ్వ) మనుష్యుని భద్రపఱుచుటకుఁగూడ శక్తుఁడ నయినాను. అతఁడు వితంతువును వివాహమాడును. అతఁడు సుమారిరువది రెండుసంవత్సరముల ప్రాయమువాఁడు ; సామాన్య పరీక్షయందు తేఱినవాఁడు; ఇప్పుడు ప్రాథమికపాఠశాలలో పదునేనురూపాయల జీతముగల యుపాధ్యాయుఁడుగానున్నాఁడు. మీరు వ్రాసెడుపక్షమున, అతఁడుకూడ మీ వద్దకువెళ్లి యేనియమముల నతఁడు నెఱవేర్పవలసియుండునో ప్రస్తావించును. అతఁడు బీదస్థితియందున్న వాఁడని నేనెఱుఁగుదును.

నేటి యుదయకాలమున రామకృష్ణయ్యగారిని కలిసికొంటిని. మీతో చేసినవాగ్దానములనే యతఁడు చేసెను. దృఢముగానుండి పట్టుదలచూపుఁడని యతఁడు మనలఁగోరుచున్నాఁడు. ఆయనవిషయమయి యిక్కడ వ్యాపించియున్న వాడికనుబట్టి విచారింపఁగా, ఆయన మిక్కిలి యుత్సాహము కలవాఁడుగానున్నాఁడు. ఈ స్థలములోని యాతని కులజనులయొక్కయు నితరుల