పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/171

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాల్గవ ప్రకరణము.

157


మా ప్రతిపక్షు లనాధబాలికాకేశ ఖండనాదులయందు పాటుపడుచుండఁగా మేము తద్రక్షణోపాయా న్వేషణమునందు నిరంతర కృషిచేయుచుంటిమి. ఇంచుక విద్యాగంథముగల వితంతువులు కొందఱు తమ్ము నిరంతర వైధవ్య దుఃఖమునుండి తప్పించి కాపాడవలసినదని నాకుత్తరములు వ్రాసిరి. అప్పుడు నేనును నాతోఁజేరినవారును స్త్రీపునర్వివాహసంస్కారము యుక్తవయస్సురాని వితంతుకన్యల వివాహముతో నారంభించిన పక్షమున బహు జనరంజకముగానుండి యత్యంత శీఘ్రకాలములో వ్యాప్తికాంచఁ గలుగునని భావించియుంటిమి. ఇట్టి వితంతుకన్యలకు వివాహములు చేసెదమని బైలుదేఱినవారుసహితము కొంద ఱేర్పడిరిగాని తామిందులో ముందుగా నడుగిడుదు మనువారుమాత్రము కానఁబడలేదు. ఎల్లవారును ముందొక వివాహమైనయెడల తాము రెండవవారముగా నుందుమనెడువారేకాని తామే మొదటివారముగా నుందుమను ధైర్యశాలులు బైలుదేఱలేదు. ముందుగా నెవ్వరైన నీ కార్యమునందు ప్రవేశించుటచూచి వారికి కష్టములు వచ్చినపక్షమున తాము తప్పించుకొని దూరముగా తొలఁగుటకును వారికి కష్టములు రానిపక్షమున తామును ప్రవేశించి సుఖమనుభవించుటకును గోరుచుండుట లోకస్వభావము కదా ! ఈసాహసిక కార్యమునందు ముందంజెవేయుట కెవ్వరినైన నొక్కరిని సమ్మతిపఱుచుటకు స్వయము గామాటాడియు, మిత్రులచే మాటాడించియు, మనసుకరఁగునట్లుగా రహస్య లేఖలనువ్రాసియు, నానాముఖముల కృషిచేయుచునే యుంటిమి. అప్పుడు విద్యార్థిగానుండి సర్వవిధముల మాకు సాయపడు చుండినట్టియు, తరువాత మా గోదావరీమండలములో, మండల కరగ్రాహి సిరస్తాదారు పదవియందుండి యిప్పుడు కీర్తి శేషులయినట్టియు, పెద్దిభట్ల వేంకటప్పయ్యగారు పట్టపరీక్షార్థము చెన్న పట్టణమునకుఁబోవుచు పొగయోడ నెక్కుటకయి కాకినాడకువెళ్లి యచ్చటినుండి 1881 వ సం. నవంబరునెల నాలవ తేదిని నాపేర వ్రాసినలేఖలోనుండి యొక భాగమును మాయప్పటి కృషిని దెలుపుటకయి యిందుఁ బొందుపఱుచుచున్నాను.