పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/170

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

156

స్వీయ చరిత్రము.



తెచ్చి "అమ్మాయీ! నీనిమిత్త మీబట్టతెచ్చితి" నని చెల్లెలిచేతికీయఁ బోయెను. ఆవితంతుబాల దానిని గైకొనక "అన్నయ్యా ! నా కిప్పుడు చీరలున్నవి. ఈ బట్టలు వదినెకిమ్ము" అని బదులుచెప్పెను. ఆమాటల కతఁడు మండిపడి "ఇదేమి చేటుకాలమే? విధవలుకట్టుకోవలసిన యీబట్టను ముత్తైదువకిమ్మ నెదవు ?" అని మందలించెను. "అన్నయ్యా ! కోపకడకు. నీభార్యవలెనే ముత్తైదువను కాఁబోయెడు నాకుమాత్ర మీబట్టపనికివచ్చునా?" అని సంశయింపక యాగడుసరిపడుచు ప్రత్యుత్తరముచెప్పెను. ఆమాటల కతఁడు విస్మయపడి గుండెలు బాదుకొనుచు సభాపతులవద్దకు కొంపమునిఁగిపోయినట్టు పరుగెత్తిపోయి తనయింటనడచిన వైపరీత్యమును విన్న వించి యంగలార్చెను. వారాతని నూఱడించి తగిన ప్రతిక్రియ నాలోచించెదమని చెప్పి యప్పటి కింటికిఁ బంపివేసిరి. ఆ చిన్న దానికి పుట్టు వెండ్రుకలు తీయించఁ బడెనో వివాహముచేయించఁబడెనో యేమిజరగెనో వినవలెనని దీనింజదువు వారికి కుతూహలము కలుగవచ్చును. ఈ రెంటిలో నేపనియు జరగ లేదు. ఆ బాలవితంతువు బలవంతముగా శిరోజములు తీయించుటకు లోఁబడునది కాకుండెను. అందుచేత బంధుబృందమును శిష్టవర్గమును నాలోచించి నడిమిమార్గము నొకదానిని కనిపెట్టి తమకుల గౌరవమును కాపాడుకొనిరి. మనవారు పూర్వాచార పరాయణులగుటచేత నీతిబాహ్యమైన గూఢ వ్యభిచారము నైన నంగీకరింతురుగాని యాచారవిరుద్ధమైన ధర్మవివాహము నంగీకరింపరు. ఇంట నేయుండి వివాహముతోఁ బనిలేక నీమనసునచ్చినవానితో స్వేచ్ఛముగా విహరింపవచ్చుననియు, నీస్వైరిణీవ్యవహారమున కెవ్వరును నడ్డురాఁ గలవారుకారనియు, నమ్మఁబలికి కావలసినవా రాయనాధబాలను వివాహ ప్రయత్నమునుండి విముఖురాలిని జేసిరి. ఱంకుసాగినపెండ్లి యక్కఱలేదను సామెతను ప్రమాణముగాఁ గైకొని యాయభాగ్యురాలిప్పటికిని కులములోనే యుండి దుర్వృత్తియందు కాలముగడపుచు బహిష్కారబాధలేక కులమును పావనము చేయుచున్నది.