పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/169

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాల్గవ ప్రకరణము.

155



కాల్చుటవలన దగ్గుపోవునని యాశపెట్టి నామిత్రులును బంధువులును వైద్యులు కొందఱును నాచేత చుట్టలు కాల్పింపవలెనని బహువిధముల ప్రయత్నము చేసిరికాని యీశ్వరానుగ్రహమువలనను స్వాభావికమైన నా దృఢనిశ్చయత్వమువలనను వారిహిత బోధనలకు లోఁబడినవాఁడను గాను.[1]

మార్కండేయస్వామి యాలయములో సభజరిగినదినము మొదలుకొని మాపట్టణములోని పూర్వాచారపరాయణులలో సంక్షోభము హెచ్చుటకు మఱికొన్ని కారణములు కూడ తటస్థించెను. నాయుపన్యాసములవలనను బోధనలవలనను కలిగిన యుత్సాహముచేత విద్యార్థుల నేకులు తాము వితంతు కన్యలను వివాహమాడి లోకమునకు దారిచూపెదమని నిశ్శంకముగా ఘోషింపమొదలు పెట్టిరి; వితంతుకన్యలు సహితముకొందఱు తమ డెందములలో నంకురించిన సుఖాశాబీజములు మొలకలెత్తి పయికిలేచి యుత్సాహపఱుపఁగా సంతోషచిహ్నములను కనఁబఱుపసాగిరి. ఈ సంబంధమున రాజమహేంద్రవరమున నడచినయొక చిన్నవృత్తాంతము నిందుదాహరించెదను. జ్యోతిశ్శాస్త్ర విదుఁడయి వైదికమార్గోపజీవియయిన యొక శిష్టబ్రాహ్మణగృహస్థుఁ డుండెను. పినతండ్రి కూఁతురగు పదునాఱేండ్ల ప్రాయముగల యనాధబాల వితంతు వొకతె యాయనయొద్దనుండెను. పిన్న వయస్సుగలదగుటచే నాబాల వితంతువు చీరలు కట్టుచు, రవికలు తొడుగుచు, నగలు ధరించుచు బొట్టు లేక పోవుటచేఁ దక్క నితరవిషయములయం దించుమించుగా సువాసినివలెనే యుండెను. అప్పటివితంతు వివాహప్రయత్న జనిత సంక్షోభభీతిచేత సంరక్షకులు బ్రహ్మచారి బాలురకు బలాత్కార వివాహమహోత్సవములు జరప వేగిరపడునట్లే బాలవితంతు బ్రహ్మచారిణులకు వస్త్రాలంకారములను తొలఁగించి కేశఖండనమహోత్సవములునడప త్వరపడుచుండిరి. ఈసందడిలో మన దవజ్ఞ శిఖామణి తనవిధవచెల్లెలికి చీరలుమాన్పి వితంతువులుకట్టెడి యంచులేనిముతుకబట్ట కట్టింపనెంచి యంగళ్లవాడకుఁబోయి యొకముతుకబట్ట కొని

  1. ఇంతవఱకును చెన్న పురిలో 1902 వ సంవత్సరమునందు వ్రాయఁబడెను.