పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/164

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

150

స్వీయ చరిత్రము.

నేనే మధ్యవర్తినిగానున్న సభలో జరపఁబడినయేర్పాటునుబట్టి స్వాములవారు కులటాపుత్రుఁడైన తమశిష్యునిఁ బీఠమునుండి పంపి వేసినతరువాతనే పట్టణములో వారికి భిక్షలుజరగినవి. స్త్రీ పునర్వివాహవిషయమైన శాస్త్రమునుగూర్చి సిద్ధాంతనిర్ణయము చేయవలసినదని నేనును న్యాపతి సుబ్బారావు పంతులుగారును కాజ రామకృష్ణారావుగారును వ్రాళ్లు చేసి స్త్రీపునర్వివాహ ప్రవర్తక సమాజమువారి పక్షమునఁ బంపిన విజ్ఞాపనపత్రము ననుసరించి జరగినసభలో స్వాములవారిపక్షమునఁ వచ్చినప్రతినిధి యయిన యద్దేపల్లి కృష్ణశాస్త్రులవారు "స్వాములవారు బహుజనులయిష్టానుసారముగా నడవవలసినవారుగనుక బహుజనులు చేరి స్త్రీపునర్వివాహము తమకిష్టమని సంఘవిజ్ఞాపనమును వ్రాసి కొన్నచో వారాలోచింతురనియు, శాస్త్ర మెట్లున్నను పూర్వకాలములయందు సహితము దేశకాలానుగుణముగా నిబంధనముల నేర్పఱుచుకొనుచుండుట గలదనియు, బహుజనాభిప్రాయమునుబట్టియు దేశమునఁ గలుగుచున్న నష్టములనుబట్టియు నాలోచించి ప్రస్తుతకాలమునకుఁ దగినట్టుగా నిప్పుడు క్రొత్త నిబంధనముల నేర్పఱుచుకొనుట కేయాక్షేపమును లేదనియు," చెప్పి యప్పటికి తప్పించుకొనవలసిన వారయిరి.

1880, 1881 వ సంవత్సరములలో మాప్రార్థనాసమాజముకూడ మహోచ్చదశయం దుండినది. నేనే దానికి నియతధర్మోపన్యాసకుఁడనుగా నుండెడివాఁడను. నాధర్మోపదేశములను వినుటకు వందలకొలఁదిజనులు వచ్చెడువారు. ఇతరసామాజికులును మహోత్సాహముతోఁ బనిచేసెడువారు. ఏలూరి లక్ష్మీనరసింహము గారు మాయందఱికంటెను నప్పు డధికోత్సాహమును శ్రద్ధాళుత్వమును భక్తియుఁ గనఁబఱచెడివారు. అప్పటి యాయన వ్యగ్రతను జూచి యాయనవలన దేశమున కెంతో మేలు కలుగునని నే ననుకొనెడివాఁడను. పరిశుద్ధాస్తికమత వ్యాపనమునిమిత్తమయి యాయన యాస్తిక పాఠశాల యను పేరితో నొకపాఠశాలను స్థాపించెను. పాఠశాలాస్థాపనమునందు మే మందఱము నేకీభవించియే పనిచేసితిమికాని దానిని నడుపువిషయమయి మాలో నభిప్రా