పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/163

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాల్గవ ప్రకరణము.

149

నేమో భక్ష్యవిశేషమని భావించి "అమ్మా ! ఇప్పుడు కడుపునిండుగానున్నది. మఱి రెండుగడియలసేపు తాళి తీసికొని రమ్ము." అని యుత్తరము చెప్పెనఁట ! యతీశ్వరులలో ననేకులకు మతవిషయకజ్ఞాన మీరీతిగానేయుండును. రాజమహేంద్రవరమున జరుగుచున్న విధవావివాహప్రయత్నమునుగూర్చి తునియొద్ద నున్న ప్పుడే మాస్వాములవారు విని తా మచ్చటకు విజయంచేసి నప్పు డాపనిలోఁ బ్రవేశించినవారి నందఱిని వెలివేసేదమని యానతిచ్చిరఁట ! పీఠాధిపతుల యర్హ కృత్యములనుగూర్చియు, వారు విత్తాపహరణమునిమిత్తము చేయుచున్న యకృత్యములనుగూర్చియు, వారిని స్వకృత్యమునకు మరల్చుటకు శిష్యులు చేయవలసిన కర్తవ్యమునుగూర్చియు, మా వివేకవర్ధని బహువిధముల వ్రాసి ప్రజలకన్నులు తెఱపుట కారంభించినది. ఈస్వాములవారు మగనినివిడిచి లేచిపోయి బహిరంగముగా జగన్నాధపురములో వ్యభిచరించు చుండిన యొక బ్రాహ్మణకులటవలన ధనస్వీకారమునుజేసి యా యిల్లాలివలన భిక్ష గైకొని భార్యను విడిచి పెట్టినందునకయి దానిమగనికి బహిష్కారపత్రికను బంపి యాతనికి శుద్ధపత్రిక నిచ్చుటకయి యధికవిత్తమును లాగఁజూచిరి; రాజమహేంద్రవరమునందు మండలన్యాయసభలో క్రిమినల్ రికార్డుకీపరుగా నుండి యుద్యోగమును బోఁగొట్టుకొని యేఁబదియేండ్లు దాఁటియున్న బొల్లాప్రగడ వెంకన్న గారను వృద్ధగృహస్థు చిరకాలముక్రిందటనే ముట్లుడిగినయేఁబదియేండ్ల వృద్ధాంగనతో వ్యభిచరించినట్లు నేరము మోపి యాయనకు బహిష్కారపత్రికను బంపి విశేషవిత్తము నాకర్షించుటకయి ప్రయత్నించిరి, చిరకాలముక్రిందటనే కులము విడిచి లేచిపోయి తురక పేటలోఁ గాపురముండి బిడ్డలనుగన్న యొక బ్రాహ్మణకులటయొక్క పుత్రుని తమపీఠమువద్ద శిష్యునిగా స్వీకరించిరి. ఇవి యన్నియు వివేకవర్ధని వెల్లడించుటచేత రాజమహేంద్రపుర వాసులు స్వాములవారియెడ గౌరవము లేనివారయి మాపురమునకు వచ్చినప్పుడు వారికి భిక్షలు చేయకుండిరి. ఈప్రకారముగా నెవ్వ రెవ్వరినో వెలివేసెదమని వేంచేసిన స్వాములవారు మాపురమున భిక్షలుగానక తామే వెలిపడవలసినవారయిరి.